ప్రజాశక్తి – రాజోలు రైతుకు పంట పెట్టుబడి కోసం సాయం అందిస్తున్నామంటూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి వారి నుంచి రాబెట్టుకునే పనిలో పడుతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, చమురు ధరల పెంపే ఇందుకు ఉదాహరణ. వాటి ద్వారా పరోక్షంగా రైతుల నడ్డి విరుస్తున్నాయి. దీంతో అన్నదాతలు సాగుపై ముందుకు వెళ్లాలా వెనక్కు తగ్గాలా? అన్న అయోమయంలో పడుతున్నారు. రబీ సాగుకు విముఖత చూపుతున్నారు.ఈ ఏడాది ఎరువుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచారు. విచిత్రం ఏమిటంటే పెట్రోల్, డీజిల్ వంటి చమురు ధరలు ప్రతీ రోజు పెరుగుతున్న మాదిరిగా ఎరువుల ధరలను పెంచేలా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది. ఇది దారుణమైన పరిణామం. ఇక నుంచి ఏ రోజుకారోజు ఎరువుల ధరలు మారే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఖరీఫ్ కలిసిరాక.. దాళ్వా పెట్టుబడులకు సొమ్ములకు ఇప్పటికే సతమతమవుతున్న రైతులపై కాంప్లెక్ ఎరువుల ధరల భారం పడింది.కాంప్లెక్ ఎరువుల బస్తా (50 కిలోలు) ధరలు రూ.50 నుంచి రూ.230 మేర పెరగడంతో జిల్లాలో రైతులపై రూ.10.10కోట్ల మేర అదనపు భారమవుతోంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే రబీలో ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు నాలుగు బస్తాలు వరకు రెండు మూడు రకాల కాంప్లెక్స్ ఎరువులు, రెండు బస్తాల యూరియా, అర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. జిల్లాలోని 1.88లక్షల ఎకరాల్లో రైతులు రబీ సాగు చేస్తుండగా 80 శాతం మేర నాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో సుమారు 40.4 వేల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని అంచనా. రైతుకు ఎరువుపై అదనపు భారం డిఎపి, యూరియా ధరల్లో మార్పులు లేకపోయినా కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. రానున్న సీజన్‌లో డిఎపి రూ.200లకుపైగా పెరగనున్నట్టు తెలుస్తోంది. రబీలో ఎక్కువగా వినియోగించే 10:26:26 కాంప్లెక్స్ ఎరువు బస్తా రూ.230లు పెరగ్గా, 14:35:14 బస్తా రూ.100, 20:20:013 బస్తా రూ.50 వరకు పెరిగాయి. ఎకరాకు రూ.500 వరకు రైతులపై అదనపు భారం పడుతోంది. రైతులను ఆదుకోలేని కూటమి ప్రభుత్వం వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణం, చివరిలో దళారుల దోపిడీతో గత ఖరీఫ్ పంట రైతులకు కలిసిరాలేదు. చాలామంది రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సాయం కొరవడింది. ఏడాది రూ.20 వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్‌లో ప్రకటించిన అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వలేదు. ఖరీఫ్ నష్టపోయిన రైతులకు కనీసం బీమా పరిహారం అందించకపోగా ఈ రబీ నుంచి ఎకరాకు రూ.615 చొప్పున జిల్లా రైతులపై మొత్తంగా రూ.11.56కోట్ల బీమా ప్రీమియం భారాన్ని మోపింది. పంట పెట్టుబడులకు రైతుల దగ్గర డబ్బుల్లేక దాళ్వా సాగులో తీవ్ర జాప్యమవుతోంది. ఈ తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల గుబులు పుట్టిస్తోంది. పెరిగిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చినట్టు ఎరువుల కంపెనీల డీలర్లు చెబుతున్నారు. యూరియాపైనే ప్రభుత్వ నియంత్రణ ఎరువుల విషయంలో యూరియాపైనే కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంది. కాంప్లెక్స్ ఎరువుల విషయంలో ప్రభుత్వ రాయితీ లేకపోవడంతో ఆయా కంపెనీలు తయారీ ఖర్చు ఆధారంగా ధరలు నిర్ణయించే అవకాశం ఉంది. యూరియా బస్తా (45 కిలోలు) తయారీకి రూ.1614 ఖర్చవుతోంది. కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.1347.50 రాయితీ భరించి రూ.266.50కు అందిస్తోంది. 50 కిలోల డీఏపీ బస్తాపై రూ.175 చొప్పున ధర పెంచడంతో ప్రస్తుతం రూ.1350గా ఉంది.
