ప్రజాశక్తి-పెరవలి మండలంలోని నడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గత కొంతకాలంగా ప్రజలకు తాగునీరు అందక పలు ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆదివారం ఆందోళన చేపట్టారు. ప్రధానంగా మూడు నెలల నుండి జల్ జీవన్ పనుల సాకు చూపుతూ గ్రామపంచాయతీ ప్రజలకు తాగునీరు అందించకుండా కాలయాపన చేస్తున్నారని పలువురు అంటున్నారు. వేసవిలో ప్రజలు గొంతెండి బిందెడు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. ఉగాది శ్రీరామనవమి పండుగ సీజన్లో కూడా తాగునీరు సక్రమంగా అందజేసిన దాఖలాలు లేవని వాపోతున్నారు. గ్రామంలో అందరికీ చేతు పంపులు లేక ఎక్కువ మంది తాగునీరు ఇతర అవసరాలకు పంచాయతీ నీటిపై ఆధారపడుతున్నారు. దీనిపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడు లేడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు అధికారులు అందజేసే క్రమంలో పంచాయతీ కుళాయి నీటి పన్ను మినహాయించుకుని మిగిలిన సొమ్ము లబ్ధిదారులకు అందజేశారని పలువురు అంటున్నారు. కుళాయి పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు తాగునీరు అందించడంలో శ్రద్ధ లేదని వారు వాపోయారు వంట చేసుకోవడానికి, తాగటానికి వాటర్ ప్లాంట్ల వద్ద నుండి గత కొంతకాలంగా నీటిని కొనుగోలు చేయవలసిన దుర్భర పరిస్థితి ఏర్పడిందని పలువురు అంటున్నారు. అధికారులు స్పందించి వేసవిలో ప్రజల దాహార్తి తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
