అన్నదాతకు అండగా వైసిపి పోరుబాట

Dec 13,2024 22:35
వైసిపి

బొమ్మూరు నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌
రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న అ న్యాయానికి వ్యతిరేకంగా వైసిపి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎంఎల్‌ఎలు జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, నాయకులు గూడూరి శ్రీనివాస్‌, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిల రెడ్డి తదితరులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువవుతోందన్నారు. అన్నదాతకు అండగా వైసిపి నిలిచిందన్నారు. ధాన్యానికి గిట్టుబాటు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్ష్యాన్ని మించి దిగుబడి సాధించినా రైతుల వద్ద దళారులు తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటున్నారన్నారు. రూ.1,750 గిట్టుబాటు ధర ఇస్తామని ప్రభుత్వం చెప్తుంటే దళారులు మాత్రం రూ.1,300 లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. తక్షణం పెట్టుబడి సాయం రూ.20వేలు అందించాలన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఖరి కారణంగా 75 కేజీలు బస్తాకు రైతులు రూ.400 నష్టపోతున్నారన్నారు. ఉచిత పంటల బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్‌ చేశారు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ అందడం లేదని రైతుల ఆందోళనలో ఉన్నారన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేసిందన్నారు. నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు నాయుడుకు అలవాటే నన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరోసారి మోసం చేసిన ఆయనకు ప్రజా తిరుగుబాటును ఎదుర్కొనక తప్పదన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ నాడు వైఎస్‌ఆర్‌ వ్యవసాయ రంగానికి పెద్ద పీఠం వేస్తూ రైతులకు తోడుగా ఉన్నారన్నారు. ఆయన ఆశయాలను జగన్‌ అమలు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్‌ సిక్స్‌ పేరిట మార్క్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే సాయం కాకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామని చెప్పి పైసా కూడా విదల్చలేదన్నారు. మాజీ ఎంఎల్‌ఎలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు మోసం మరో మారు రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️