పర్యావరణ హిత కప్పులు, బ్యాగుల నమూనాకు బహుమతి

Nov 27,2024 00:15

విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేస్తున్న ఎమ్మెల్యే కన్నా లకీëనారాయణ
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
విద్య వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని, విద్యతోపాటు వైజ్ఞానిక ప్రదర్శనలు, క్రీడల్లో విద్యార్థులు రాణించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. మండలంలోని రామకృష్ణాపురం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మంగళవారం ముగిసింది. ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలలో తాగునీటి సౌకర్యం కోసం ఆల్కలైన్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. రాజకీయాలకు, దూరంగా విద్యా వ్యవస్థను ఉంచేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తొలుత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.విజేతలు.. సైన్స్‌ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా, జగ్గయ్యపేట గురుకుల విద్యార్థి పి.గౌతమ్‌ తయారు చేసిన అన్‌ పొల్యూటెడ్‌ పేపర్‌ కప్స్‌ బ్యాగ్స్‌ మేకింగ్‌ ప్రమ్‌ బనాన స్టీమ్‌ నమూనాకు మొదటి బహుమతి లభించింది. ఐసిటి విభాగంలో విశాఖపట్నం స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ విద్యార్దిని ఎం.రోడఇవాంజలీ తయారు చేసిన మల్టీ లెవెల్‌ కార్‌ పార్కింగ్‌ నమూనాకు మొదటి బహుమతి దక్కింది. సైన్స్‌, సోషల్‌, మ్యాథ్స్‌, ఐసిటి, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ విభాగాల్లో నమూనాలను తయారు చేసిన జూనియర్‌, సీనియర్‌ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గురుకుల విద్యాలయాల అదనపు కార్యదర్శి కె.సునీల్‌ రాజ్‌, సంయుక్త కార్యదర్శి ఎన్‌.సంజీవరావు, డిసిఒ కె.పద్మజ, నందిగామ సర్పంచ్‌ బలిజేపల్లి రమాదేవి, ప్రిన్సిపాల్‌ జాన్సన్‌ పాల్గొన్నారు.

➡️