విద్యకు అధిక ప్రాధాన్యత : మంత్రి

ప్రజాశక్తి-కొండపి : విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. స్థానిక అంబేద్కర్‌ బాలికల గురుకుల విద్యాలయంలో జోన్‌ స్థాయిలో సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించారు. తొలుత మంత్రి స్వామికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యాలయం ప్రాణంగంలోని అంబేద్కర్‌ విగ్రహానికి, వేదికపై ఉన్న చిత్రపటానికి పూలమాలలు వేసి,నివాళులర్పించారు. విద్యార్థులు రూపొందించి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన వివిధ ప్రాజెక్టులను మంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఒకప్పుడు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలలే ఉండేవన్నారు. ఇప్పుడు చాలా రకాల పాఠశాలలు వచ్చాయన్నారు. విద్యార్థులను భావి బారత పౌరులుగా తీర్చిదిద్దాలనే మహోన్నత ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి. రామారావు ఈ పాఠశాలలను తీసుకొచ్చినట్లు తెలిపారు. పేదరికం, ఇతర కారణాల వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరాయకొండ గురుకులు పాఠశాలను వెలుగు పథకం ద్వారా తీసుకొచ్చినట్లు తెలిపారు. కొండపిలోనూ గురుకుల పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో అప్పటి మంత్రి కీర్తి శేషులు దామచర్ల ఆంజనేయులు 11 ఎకరాల దేవదాయ భూములను కొనుగోలు చేసి పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ సంజీవరావు, మూడు జిల్లాల డిసిఒలు, ఎఎంసి మాజీ చైర్మన్‌ జి.రామయ్య చౌదరి, తహశీల్దారు మురళి, ఎంపిడిఒ రామాంజనేయులు, ఎంఇఒలు సురేఖ, రామారావు, సిఐ సోమశేఖర్‌ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️