క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత

ప్రజాశక్తి-వీరబల్లి విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉప్పరపల్లె జడ్పీ హైస్కూల్‌లో కబడ్డీ పోటీలలో జాతీయ స్థాయికి ఎంపికై మధ్యప్రదేశ్‌లో కబడ్డీ పోటీలలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని మాచిరెడ్డి కావ్యశ్రీ అభినందన సభలో మంత్రి చేతుల మీదుగా ఆమెకు సీల్డ్‌ ప్రదానం చేశారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌, మధ్యప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఉదరు ప్రతాప్‌ సింగ్‌ అభినందించారు. రెడ్డి కావ్యశ్రీ తల్లిదండ్రులు జిల్లా పరిషత్‌ పాఠశాల మాజీ చైర్మన్‌ చిన్న రెడ్డప్పరెడ్డిని, ఆయన సతీమణిని మంత్రి అభినందించారు. వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పైనే కాకుండా క్రీడలలో కూడా రాణించి మంచి క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు విద్య ఉద్యోగాలలో అధిక ప్రాధాన్యతని ఇస్తోందన్నారు. కావ్యశ్రీ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నియోజకవర్గం విద్యార్థులు ఎంసెట్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షలలో మంచి ర్యాకులు సాధించడం జరుగుతుందన్నారు. క్రీడా రంగాలలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రతిభ కనబరచడం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడా భివద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిఇఇ సుబ్రహ్మణ్యం, సిఐ వరప్రసాద్‌, తహశీల్దార్‌ శ్రావణి, ఎస్‌ఐ మోహన్‌ నాయక్‌, ఎంఇఒలు కృష్ణయ్య, రామకృష్ణుడు, జడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, స్కూల్‌ చైర్మన్‌ సిబ్బంది పాల్గొన్నారు. నూతన బోరును ప్రారంభించిన మంత్రి చిన్నమండెం: మండలం, చాకిబండ, గ్రామం అంబా బత్తినవాండ్లపల్లిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నూతనంగా వేసిన బోరు ద్వారా గ్రామానికి నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబాబత్తినవాండ్లపల్లెలో నీటి సమస్య అధికంగా ఉండడంతో బోరు వేసి గ్రామానికి నీటి సరఫరా చేయడం జరిగిందని పేర్కొన్నారు. నీరు వదలడంతో ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఎక్కడైనా ఉంటే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్‌ లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి సిసి రోడ్లు : చాకిబండ, కుమ్మరపల్లెలో రూ.17 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గం గతంలో అభివద్ధికి నోచుకోక ఎంతో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు, మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. రాబోయే రోజులలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్‌ రోడ్లు నిర్మించి గ్రామాలలో అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.

➡️