ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
– ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద నుండి ఆర్‌డిఒ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఒ వంశీకృష్ణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.హర్ష, కావలి పట్టణ కార్యదర్శి ఉదరుకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పెండింగ్‌లో ఉన్న కోట్ల రూపాయల విద్య దీవెన – వసతి దీవెన, వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. తల్లికి వందనం పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్ అమలపై స్పష్టత ఇవ్వాలన్నారు. జిఒ నెంబర్ 77 రద్దుచేసి, పిజి చదివే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్‌మెంట్ వర్తింపజేయాలన్నారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ హాస్టల్‌కు సొంత భవనాలు కేటాయించాలన్నారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.జీవన్, కావలి కమిటీ సహాయ కార్యదర్శి వి.మోక్షిత్సాయి, సభ్యులు లోకేష్, భాను, సన్నీ, అరుణ్, షేక్. నాయబ్ రసూల్ పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.