గ్రామ పంచాయతీల అభివద్ధికి కృషి

ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లె గ్రామసభల ద్వారా ప్రజా ప్రణాళికలు రూపొందించుకొని పంచాయతీలు అన్ని రంగాలలో సమగ్రంగా అభివద్ధి చెందాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపలి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించిన మేరకు లక్కిరెడ్డిపల్లెలో ప్రజాదర్బార్‌ ప్రత్యేక గ్రామసభ ప్రజా ప్రణాళిక కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్‌ సుద్దల అహల్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్దేశించిన 29 అంశాలలో పంచాయతీ అభివద్ధి ప్రణాళికలను ప్రజల భాగస్వామ్యంతో రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్మికులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములు కావడంతో ఉత్తమ పనితీరుతో సఫారీ కర్మచారి అంశంలో మన జిల్లాకు అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అరుదైన గౌరవం దక్కడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్య ఉందన్నారు. వెయ్యి అడుగులు బోర్‌ వేసిన నీరు రావడం లేదని తెలిపారు. రైతులకు పంటలు సాగు చేయడానికి నీరు లేదని చెప్పారు. ఎండిపోతున్న మామిడి తోటలకు నీరు అందించే పరిస్థితి లేదన్నారు. ఈ పరిస్థితులన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో తాగు, సాగునీరు అందించేందుకు కషి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భూములు అన్యాక్రాంతం కావడం, ట్యాంపరింగ్‌ జరగడం, ఆన్‌లైన్‌లో పేర్లు మార్చడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పరిపాలనలో అధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలన్న విషయంలో ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి మాట్లాడుతూ పంచాయతీలను అత్యంత సుందరంగా, స్వచ్ఛంగా చేసుకోవడం మనందరి బాధ్యతన్నారు. చెత్త నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుద్ధల అహల్య, జిల్లా, మండల అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, జడ్‌పిటిలు ఎంపిటిసిలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

➡️