విద్యారంగ బలోపేతానికి పూనుకోవాలి

Jun 10,2024 23:49

విలేకర్లతో మాట్లాడుతున్న పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయ సారధి, ఇతర నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
విద్యా రంగంలో వెనుకబడిన పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌ కుమార్‌, జి.విజయసారధి కోరారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ విద్య రంగాన్ని ఉపాధ్యాయులు, మేధావులు కలిసి సమిష్టిగా బాధ్యతతో కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ విద్యా రంగంలో గత ప్రభుత్వం అవలంబించిన ఒంటెద్దు పోకడల వల్ల అనేక సమస్యలు నెలకొన్నాయని గుర్తు చేశారు. ఆ సమస్యలను మొత్తం పరిష్కారం కోసం నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 117 ద్వారా ప్రాథమిక పాఠశాలలను బలి చేశారని దీంతో 3,4,5 తరగతుల పిల్లలు ఎక్కువ శాతం బడికి దూరమయ్యారని చెప్పారు. తక్షణమే జీవో 117ను రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు నిలిపివేయాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని, 1998-2008 టీచర్లను రెగ్యులర్‌ చేయాలని కోరారు. మెగా డీఎస్సీని విడుదల చేసి 25 వేల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా సహాధ్యక్షురాలు ఎ.భాగేశ్వరిదేవి, జిల్లా కోశాధికారి జై వాల్యా నాయక్‌, జిల్లా కార్యదర్శిలు కె.తిరుపతిస్వామి, వి.నాగేశ్వరరావు, షేక్‌ అయేషా సుల్తానా, షేక్‌ కాసింపీరా, అరుణకుమారి పాల్గొన్నారు.

➡️