రైతుల ఆదాయం పెంచేందుకు కృషి

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ రైతుల ఆదాయవనరులు పెంచుకునేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, జెసి ఆదర్శ రాజేంద్రన్‌ అన్నారు. మంగళవారం మదనపల్లెలో 14 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న రైతు బజారును పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే, జెసి మార్కెటింగ్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో కలసి స్టాల్స్‌ను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లెలో దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉన్న రైతు బజారును ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడంలో కలెక్టర్‌, జెసిలు చూపించిన చొరవను ప్రశంసించారు. రైతులు పండించిన పంటలు నేరుగా అమ్ముకోవడానికి ఉచితంగా స్ట్రాల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లోనే నేరుగా రైతుల ద్వారా నాణ్యమైన తాజా కూరగాయల అందించడమే లక్ష్యంగా రైతు బజార్‌ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మార్కెటింగ్‌ ఎడి త్యాగరాజు రైతుబజార్‌ను పునఃప్రారంభంలో క్రియాశీలకంగా వ్యవహరించారని అభినందించారు. కోమిటివాని చెరువును సుందరీరణ చేయడంలో దష్టి సారించామన్నారు. సిటిఎం రోడ్డులో ట్రాఫిక్‌ ఇబ్బందులకు తొలగించి 60 అడుగుల రోడ్డు వేసేలా చెట్లు తొలగించామన్నారు. మదనపల్లెలో రెవెన్యూ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టపరిధిలో ఆక్రమణలను గుర్తించి, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతుబజార్‌ ఏర్పాటుకు జెసి రూ.లక్ష సొంత నిధులు సమీకరించడం అభినందనీయమన్నారు. జెసి ఆదర్శ రాజేంద్రన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో రైతుల అభిరుచి మేరకు అన్ని మౌలిక సదుపాయాలతో రైతుబజార్‌ను అభివద్ధి చేశామన్నారు. రైతుబజార్‌ను వినియోగంలోకి తీసుకురావడానికి మరింత ప్రచారాన్ని కల్పిస్తామన్నారు. కోమిటివాని చెరువును అభివద్ధి చేయడంతోపాటు వాకింగ్‌ ట్రాక్‌, లైటింగ్‌, బోటింగ్‌ ఏర్పాటు చేయడానికి తమ పరిధిలో నిధులు అందించే విధంగా కషి చేస్తామన్నారు. మార్కెటింగ్‌ ఎడి త్యాగరాజు మాట్లాడుతూ మదనపల్లి రైతుబజార్‌ను జిల్లాకే రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దడానికి కలెక్టర్‌, జెసిలు ప్రత్యేకంగా నిధులను కేటాయించారన్నారు. రానున్న పది రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఆర్‌డిఒ, టమోటా మార్కెట్‌ కార్యదర్శి అభిలాష్‌, మొలకలచెరువు మార్కెట్‌ కార్యదర్శి జగదీష్‌, అగ్రికల్చర్‌ ఎడి శివశంకర్‌, జిల్లా ఉద్యానవన అధికారి పి.రవిచంద్రబాబు, మండల వ్యవసాయ అధికారి నాగప్రసాద్‌, హెచ్‌ఒ ఈశ్వర్‌ ప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, తహశీల్దార్‌ ఖాజాబీ, నాయకులు ఎస్‌.ఎ.మస్తాన్‌, నాదెళ్ల విద్యా సాగర్‌, ముసలికుంట నాగయ్య, యర్రబల్లి వెంకటరమణరెడ్డి, ప్రభాకర్‌, బీదం గురునాథ్‌ యాదవ్‌, బెస్త రమణ, జివి నాయుడు, మధుసూదన్‌రెడ్డి, బాలమాలి శేఖర్‌, మాజీ కౌన్సిలర్‌ తలారి రాధమ్మ, జాఫరన్నీషా, రైతులు రాజన్న, వెంకట లక్షమ్మ, రాజశేఖర్‌ నాయుడు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.తహశీల్దార్‌ కార్యాలయంలో జెసి తనిఖీ : మదనపల్లి తహశీల్దార్‌ కార్యాలయాన్ని జెసి ఆదర్శ రాజేంద్రన్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, విఆర్‌ఒలతో సమీక్ష నిర్వహించారు. పిజిఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే అర్జీలు, చుక్కల భూముల సమస్యలు, జాతీయ రహదారి పెండింగ్‌ పనులు తదితర అంశాలపై సమీక్షించి వాటిని త్వరగా పరిష్కరించే విధంగా తగు సూచనలను చేశారు. అనంతరం కోమటి వాని చెరువును సందర్శించి అధికారులకు తగు సూచనలను చేశారు.

➡️