ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుందని, గ్రామ స్ధాయి నుంచి పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేస్తున్నారని, పిసిసి ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇన్‌ఛార్జి గౌతు సత్యేంద్ర బాబు తెలిపారు. స్థానిక డిసిసి కార్యాలయంలో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో త్వరలోనే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. దేశాన్ని తిరిగి అభివద్ధి బాటలో నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపిలు అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమైన వైసిపి పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల సమస్యలను వైసిపి పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ ఉద్యోగులను విధులలో నుంచి తొలగించిన అంశంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసిపి స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ముందడుగు వేసి అల్టిమేటం జారీ చేసి 48 గంటల గడువు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. 24 గంటల సమయం కూడా అవ్వకముందే ప్రభుత్వం దిగివచ్చి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధులలోకి తీసుకోవటం కాంగ్రెస్ పార్టీ విజయమన్నారు. ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించిందని, త్వరలోనే నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, డిసిసి ఆధ్వర్యంలో జిల్లా, మండల కమిటీలు నియమించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి విజేష్ రాజ్ మాట్లాడుతూ షర్మిలా రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే పూర్తి నమ్మకం ఉందన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రకాశం జిల్లా అని, జిల్లాలో ఎన్నో ప్రధాన సమస్యలు ఉన్నాయని, వెలిగొండ ప్రాజెక్టు, దొనకొండ ఇండిస్టీయల్ కారిడార్, ఒంగోలు డెయిరీ, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో టిడిపి, వైసిపి సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలూ చేపట్ట లేదన్నారు.ఈ సమస్యలను పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి దష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి జిల్లా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉద్దండి మల్లికార్జునరావు, ఉంగరాల శ్రీను, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రిహానా బాను, యూత్ కాంగ్రెస్ నాయకులు దాసరి రవి, కైపు వెంకట కష్ణారెడ్డి, గిద్యోను, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్డు సతీష్, చిరంజీవి, గుత్తి రాజు పాల్గొన్నారు.
