ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కోడిగుడ్ల ధర రోజురోజుకూ పైపైకి పోతుంది. గతేడాది ఇదే సమయానికి ఒక గుడ్డు ధర రూ.5.50 ఉండగా ప్రస్తుతం హోల్‌సేల్‌గా అయితే రూ.7, రిటైల్‌గా అయితే రూ.8 వరకు ఉంది. గత వేసవిలో ఎండ వేడిమి తాళలేక లక్షకు పైగా కోళ్లు మృతి చెందడం, ఉన్న కోళ్లలో ఉత్పత్తి తగ్గిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. కోళ్లకు మేతగా వినియోగిస్తున్న మొక్కజొన్న ధర పెరిగి టన్ను రూ.22-24 వేలు, నూకలు రూ.18-22 వేల వరకు పెరిగినట్లు పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. మేత ధర టన్ను రూ.30 వేల వరకు పెరగడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. పెరిగిన నిర్వహణ వ్యయంతో ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తి వ్యయం రూ.5కు చేరుతుందని, అందుకే ఒక గుడ్డు ధర రూ.7 అమ్ముతున్నా తమకు లాభాలు అంతంత మాత్రమేనని చెబుతున్నారు. అయితే వినియోగదారులు మాత్రం ఈ ధరలను భరించలేకపోతున్నారు.