రసాబాసగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నిక

Jun 10,2024 00:24

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గం
ప్రజాశక్తి-తెనాలి :
పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఎన్నిక ఆదివారం స్థానిక బుర్రిపాలెం రోడ్డు బిసి కాలనీలోని సంఘ కార్యాలయంలో జరిగింది. ఎన్నికల అధికారిగా కాకతీయ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ డిఎల్‌ కాంతారావు వ్యవహరించారు. ప్రస్తుత పాలకవర్గం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కావటంతో ఎన్నిక జరిగిందని నూతన కమిటీ చెబుతోంది. ఇప్పటి వరకూ సంఘం కార్యదర్శిగా కొనసాగిన జి.సుబ్బారావు తొలుత జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్ష, కార్యదర్శులుగా బుర్రా విజయలక్ష్మి, ఆరాధ్యుల అదినారాయణరావు, గౌరవాధ్యక్షులుగా ఆరాధ్యుల కోటేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా జ.సుబ్బారావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.రామలింగేశ్వరరావు, కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా బి.నాగమణి, నిర్మాలా రమేష్‌, పి.సుబ్బారావు, శరత్‌వెంకయ్య, ఎం.లక్ష్మీతులసి, సంయుక్త కార్యదర్శులుగా కె.మధుకర్‌, జి.సుధీర్‌, ఎం.సుభాని, కార్యవర్గ సభ్యులుగా బడుగు మోహనరావు, జి.సుబ్రహ్మణ్యం, కె.రమేష్‌, ఎస్‌కె సైదా, వి.సత్యవతి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుర్రా సాయిమాధవ్‌, సిహెచ్‌ సింగారావు, ఎస్‌కె జానిబాషా, న్యాయ సలహాదారుగా హరిదాసు గౌరీశంకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతక కమిటీ ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఎన్నిక ప్రక్రియలో అప్పుడే అధికార పార్టీ నాయకులమంటూ కొందరు వ్యక్తులు కూడా జోక్యం చేసుకున్నట్లు పాత కమిటీ ఆరోపిస్తోంది. కార్యక్రమంలో పలువురు కళాకారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్నిక నిబంధనలకు పూర్తి విరుద్ధం
ఆరాధ్యుల కన్నా, ఉపాధ్యక్షులు, పాత కమిటీ
ఈ ఎన్నిక పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. కేవలం సర్వసభ్య సమావేశంగా సమాచారమిచ్చారు. సమావేశానికి హాజరైతే అప్పటికప్పుడు ఎన్నికని చెప్పారు. వాస్తవానికి సంఘంలో దాదాపు 1100 మందికి పైగా సభ్యులున్నారు. వారిలో కనీసం కోరానికి సరిపడా సభ్యులు కూడా హాజరు కాలేదు. కేవలం 200 మందితో వారికి అనుకూలంగా కమిటీ ప్రకటించుకున్నారు. పాత పాలకవర్గం కాలపరిమితి ఆదివారం వరకూ ఉంది. ఆ పాలకవర్గం తమ పదవీకాలం ముగిసిన వెంటనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, జమాఖర్చులు వెల్లడించిన తర్వాత అధ్యక్షుల అనుమతితో ఎన్నిక జరగాలి. సభ్యులకు పూర్తిస్థాయి సమాచారం లేకుండా, అధ్యక్షులు అందుబాటులో లేకుండా, జమాఖర్చుల లెక్క తేల్చకుండా ఏకపక్షంగా కమిటీ ప్రకటించుకోవటం సరికాదు.

➡️