సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజి
ప్రజాశక్తి-గుంటూరు : విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విద్యుత్ భారాలు మోపడానికి నిరసనగా సోమవారం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దహనం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. సిఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని వాగ్దానం చేసి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, ఆరు నెలల్లోనే దాదాపు రూ.15వేల కోట్ల భారం మోపారని విమర్శించారు. ఈనెలలో వచ్చిన కరెంట్ బిల్లులో 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్‌లో వినియోగించుకున్న కరెంట్‌కు ఛార్జీలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఇటీవలే 2024లో నవంబర్‌లో చెల్లించిన కరెంటు బిల్లులకు కూడా సర్దుబాటు ఛార్జీలపేరుతో ప్రజలపై భారాలు మోపారని, రానున్న కాలంలోనూ ఈ బాదుడు ఆగిపోయే పరిస్థితి లేదని తెలిపారు. ఈ నెలలో చెల్లించిన విద్యుత్ బిల్లులకు కూడా వచ్చే నెలలో సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విమర్శించారు. అసాధారణంగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రజలందరూ విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో దహనం చేసి నిరసన తెలపాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం ప్రజలపై దొడ్డిదారిన విద్యుత్ భారాలు మోపటం మానుకోవాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నేతాజి డిమాండ్ చేశారు.