ప్రజాశక్తి – చీరాల: రాష్ట్రంలో ప్రజలపై మోపిన విద్యుత్ భారాలు పాలకుల వైఫల్యమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎం.వి.ఆంజనేయులు అన్నారు. శుక్రవారం చీరాల యుటిఎఫ్ కార్యాలయంలో ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెకి సంస్థ రాష్ట్రాలతో విద్యుత్ ఒప్పందం చేసుకొని ఆదాని నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసి మరీ కొనుగోలు చేయించారని ఈ ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రజలపైన ఏపీ ప్రభుత్వం రానున్న 25 సంవత్సరాల కాలంలో అమలయ్యే విధంగా లక్ష కోట్ల రూపాయలు భారాన్ని మోపేవిధంగా ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సోలార్ విద్యుత్తు రూ.1.90 పైసలు ఇస్తుంటే దానిని కాదని అదానీ ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ని రూ.2.50 పైసలకు కొనుగోలు చేసే విధంగా ఒత్తిడి చేసి ఒప్పందం చేశారని తెలిపారు. దీంతో ప్రజల పైన లక్ష కోట్ల రూపాయలు భారం పడనుందని తెలిపారు. దీని కోసం అప్పటి ముఖ్యమంత్రికి రూ.1,750 కోట్లు లంచం ముట్ట జెప్పినట్లు అమెరికాలో కేసు నమోదైందని తెలిపారు. మరోవైపున స్మార్ట్ మీటర్లు తెచ్చి ప్రభుత్వంచే ఒప్పందం చేసి వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. ఈ భారాన్ని కూడా పజలపై మోపుతున్నారని తెలిపారు. ఈ ఒప్పందాలన్నీ గతంలో ఉన్న వైసిపి ప్రభుత్వం కాలంలో జరిగినప్పటికీ ఆ ఒప్పందాలు రద్దు చేయాల్సిన ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం వాటిని మరింత సమర్థవంతంగా అమలు చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. కాబట్టి ప్రజలను దోపిడీ చేయడంలో అన్ని ప్రభుత్వాలు ఒకటే అన్నారు. దీంతో ప్రజల తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు భారమైన ఒప్పందాలు రద్దుచేసి, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జి.సూరిబాబు అధ్యక్షత వహించగా ఏ.శ్రీనివాసరావు, ఎన్.బాబురావు, ఎమ్.వసంతరవు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
