విద్యుత్‌ భారాలు, స్మార్ట్‌ మీటర్లు వద్దు : సిపిఎం

Dec 1,2024 01:44

ప్రజాశక్తి-సత్తెనపల్లి : విద్యుత్‌ ఇంధన సర్దుబాటు చార్జీలు భారం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని, వ్యవసాయ పంప్‌ సెట్లకు స్మార్ట్‌ మీటర్లు తొలగించాలని సిపిఎం సత్తెనపల్లి మండల కార్యదర్శి పెండ్యాల మహేష్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక పుతుంబాక భవన్లో శనివారం విలేకర్లతో మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయాలన్నారు. గతేడాది పంటలు నష్టపోయిన రైతులకుకు బీమా పరిహార వెంటనే చెల్లించాలని, సమగ్ర ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాలని కోరారు. వ్యవసాయ స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని గతంలో నారా లోకేష్‌ చెప్పడంతోపాటు దగ్గరుండి ఆయనే పగలగొట్టారని నేడు అదే స్మార్ట్‌ మీటర్లను బిగించడానికి అనుమతించారని విమర్శించారు. 2015లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆర్కిటెక్చర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ బాబురావు సీనియర్ల వేధింపులు వల్ల ఆత్మహత్య లేఖ రాసి చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనత కాలంలోనే ఆ కేసును కొట్టివేయడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఈ సంఘటనలో బాధ్యులైన వారిని కూటమి ప్రభుత్వం రక్షిస్తుందని అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎం.నరసింహారావు, బి.రామారావు, జె.భగత్‌, బి.శివయ్య, ఆర్‌.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

➡️