ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర కీలకం

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జెసి బి.లావణ్యవేణి
ప్రజాశక్తి – ఏలూరు
ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్‌ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో శనివారం ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఆర్‌ఒ, ఎఆర్‌ఒలను నియమించినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్‌ అధికారి పాత్ర అత్యంత కీలకమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకూ రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థుల ఖర్చు, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ, బ్యాలెట్‌ పేపర్ల తయారీ, కౌంటింగ్‌ వంటి కీలకమైన బాధ్యతలు రిటర్నింగ్‌ అధికారులపై ఉంటాయన్నారు. రిటర్నింగ్‌ అధికారులకు ఎన్నికల కమిషన్‌ అందజేసిన ‘హ్యాండ్‌బుక్‌’లోని ప్రతి ఛాప్టర్‌ను క్షుణ్ణంగా చదవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలన్నారు. షెడ్యూల్‌ విడుదలైన మరుక్షణం ఆయా కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల చిత్రపటాలు, ముఖ్యమంత్రి తదితరులతో ప్రచురితమైన వాల్‌ పోస్టర్లను తాత్కాలికంగా తొలగించాలన్నారు. మరణించిన ప్రముఖ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయనవసరం లేదని స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి మాట్లాడుతూ నామినేషన్‌ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, చెక్‌లిస్ట్‌ ప్రకారం పరిశీలన చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసే ప్రతి సర్క్యులర్‌, మార్గదర్శకాలను క్షుణ్ణంగా పరిశీలించి, దానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే అంశాలను పరిశీలించేందుకు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇవిఎంల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, ఫలితాల ప్రకటన, సి-విజిల్‌ యాప్‌ తదితర అంశాలపై ఆర్‌ఒలు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. రిసోర్స్‌పర్సన్స్‌గా వ్యవహరించిన డిఆర్‌డిఎ పీడీ డాక్టర్‌ ఆర్‌.విజయరాజు నామినేషన్‌ ప్రక్రియపై, ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, సర్వశిక్షా అభియాన్‌ ఎపిసి బి.సోమశేఖర్‌ ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి కుముదినిసింగ్‌, రిటైర్డ్‌ రెవెన్యూ అధికారి చక్రపాణి పోస్టల్‌ బ్యాలెట్‌పై, ఇవిఎ, ఐ.టి. అప్లికేషన్స్‌పై జెడ్‌పి సిఇఒ కె.సుబ్బారావు, ఎన్‌ఐసి.శర్మ వివరించారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ డి.పుష్పమణి, ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, రిటర్నింగ్‌ అధికారులు భవాని శంకరి, కె.అద్దయ్య, ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, ముక్కంటి, భాస్కర్‌, కలెక్టరేట్‌ ఎఒ కె.కాశీవిశ్వేశ్వరరావు, ఎపిఐసిసి జెడ్‌ఎంకె.బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవిఎంల వినియోగంపై అవగాహన కల్పించారు.

➡️