గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు

విక్రేతలపై పీడీ యాక్ట్‌
కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎస్‌పి డి.మేరీప్రశాంతి
ప్రజాశక్తి – ఏలూరుస్పోర్ట్స్‌
గంజాయి సరఫరా, వినియోగించే వారిపై ఆరు నెలలపాటు కనీస జైలు శిక్ష, ఇతర చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అటువంటి చర్యలకు పాల్పడే వారిని నియంత్రించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌ గౌతమి సమావేశ మందిరంలో నార్కో కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఎన్‌సిఒఆర్‌డి) జిల్లాస్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధ్యక్షతన జరిగింది. గంజాయి నియంత్రణ, డ్రగ్స్‌ అక్రమ రవాణా తదితర అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై ఎస్‌పి డి.మేరీప్రశాంతితో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గంజాయి నియంత్రణలో నిఘా పెంచడంతోపాటు గంజాయి తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గంజాయి వినియోగం డిమాండ్‌ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు ఉండాలన్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలతోపాటు విద్యార్థి దశలోనే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన పరిచి చెడు అలవాట్లపై యువత పెడదోవ పట్టకుండా చూడాలన్నారు. దీనిపై హైస్కూలు ఉపాధ్యాయులు, పీడీలకు అవగాహన కల్పించాలని ఎస్‌ఇబి అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గంజాయి అనుమానాస్పద కేసుల్లో పట్టుబడిన వారికి డ్రగ్‌ డిఅడిషన్‌ సెంటర్‌లో ఒకరోజుపాటు అవగాహన, కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. అనుమానాస్పద షీట్లులో ఉన్న వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పూర్తిస్థాయి నిఘా పెట్టాలన్నారు. ప్రయివేట్‌, ఆర్‌టిసి కార్గో రవాణా మార్గాలపై కూడా పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. జిల్లా ఎస్‌పి డి.మేరీప్రశాంతి మాట్లాడుతూ గంజాయి రవాణా, సరఫరా, వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఎఎస్‌పి నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రవాణా జరుగుతుందని, దానిని అరికట్టేందుకు పూర్తిస్థాయి దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ డి.పుష్పమణి, కమిటీ సభ్యులు దేవి, దీక్షిత, డాక్టర్‌ చంద్రహాస్‌, డి.ధనిష్టబత్తుల, అడ్వకేట్‌ కె.సత్యనారాయణ, డిఇఒ ఎస్‌.అబ్రహాం, ఉప రవాణా కమిషనర్‌ ఎస్‌.శాంతకుమారి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్‌ అబీబ్‌భాషా, జిల్లా ప్రజా రవాణాధికారి ఎన్‌విఆర్‌.వరప్రసాద్‌, ఎన్‌టిసిపి సైకలాజిస్ట్‌ కెసిహెచ్‌.వీర్రాజు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ జె.బాలు పాల్గొన్నారు.

➡️