సొంతింటి కల సాకారమే ధ్యేయం

లో వోల్టేజి సమస్య పరిష్కారానికి ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు

‘జగనన్న- వాసన్న’ మోడల్‌ కాలనీలో పూర్తయిన అభివృద్ధి కార్యక్రమాలు

పొలసానిపల్లి సర్పంచి షేక్‌ రహీమా బేగం

ప్రజాశక్తి – భీమడోలు

పొలసానిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి కుటుంబానికీ స్థలం సమకూర్చడంతో పాటు గృహ నిర్మాణ సంస్థ సహకారంతో సొంతింటి కల సాకారం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హసేన తెలిపారు. సర్పంచిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తన హయాంలో గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన, కొనసాగుతున్న సంక్షేమ పథకాల గురించి ఆమె వివరించారు. జగనన్న గృహ నిర్మాణ పథకం కింద గ్రామంలోని మూడు కాలనీల్లో గృహ నిర్మాణాల కోసం లక్షలాది రూపాయల వ్యయంతో భూసేకరణ చేపట్టామన్నారు. ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు గ్రామాభివృద్ధికి వివిధ రూపాల్లో సహకరిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి పక్కన గల 44 ఇళ్ల సముదాయంలో జగనన్న – వాసన్న కాలనీగా పేరు పెట్టామన్నారు. కాలనీ నిర్మాణానికి ముందే లబ్ధిదారులు నిర్మాణాల కోసం ఇబ్బంది పడకుండా అవసరమైన విద్యుత్‌ లైన్లు, తాగునీరు, రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం మోడల్‌ కాలనీగా రూపొందిందని తెలిపారు. దీని సమీపంలోనే ఆజాద్‌కి అమృత్‌ నిధులతో చెరువును అభివృద్ధి చేశామని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రక్షిత మంచినీటి ట్యాంక్‌ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, మరో రెండు కాలనీల్లో 103,20 గృహ నిర్మాణాల కోసం భూ సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. అక్కడ నిర్మాణాలు ప్రారంభం కావడానికి ముందే రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ పనులు పూర్తయ్యాయన్నారు. ఈ కాలనీలకు వెళ్లేందుకు అనుసంధాన రోడ్ల నిర్మాణానికి భూసేకరణ జరిగినప్పటికీ నిధులు విడుదల కాక ఆ ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభం కాలేదని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గ్రామ పరిధిలో ఇంకా ఇళ్లు మంజూరైన 200 కుటుంబాలకు భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇవన్నీ పూర్తయితే గ్రామ పరిధిలో స్థలంతో పాటు ప్రభుత్వం అందించే రాయితీలతో సు మారు రూ.10 లక్షల విలువైన సొం తిల్లు ఒ క్కొక్క కుటుంబానికి దక్కుతుందన్నారు. దీనికి అదనంగా సొంత స్థలాలు గల లబ్ధిదారుల గృహ నిర్మాణాల కోసం నిధుల కేటాయించినట్లు తెలిపారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా భీమడోలు, ద్వారకా తిరుమల రోడ్డు విస్తరణ సందర్భంగా రోడ్డు దిగువ భాగానికి చేరిన పైపులైన్‌ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి రోడ్డుకు రెండు వైపులా నూతన పైపులైను ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రామంలో పలు రక్షిత నీటి పథకాలను అనుసంధానం చేశామన్నారు. వీటిలో ఒక పథకానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా ఉండే విధంగా అదనపు విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరంగా గోదావరి తాగునీటిని అందుబాటులో ఉంచేందుకు గ్రౌండ్‌ లెవెల్‌ స్టోరేజ్‌ ట్యాంకు నిర్మించామన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జలజీవన్‌ మిషన్‌ నిధులతో పైపులను వేయడంతో పాటు, ఆ పథకం కింద 150 వరకూ కుళాయిలు అర్హులకు ఉచితంగా సమకూర్చినట్లు తెలిపారు. గ్రామంలో లోవోల్టేజ్‌ సమస్య తీర్చే క్రమంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు, కొన్ని ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వంటి కార్యక్రమాలను పూర్తిచేశామన్నారు. వీటన్నింటి ఫలితంగా గ్రామానికి లోవోల్టేజ్‌ సమస్య లేకుండా పోయిందన్నారు. నాడు-నేడు నిధులతో గ్రామంలోని మూడు ప్రాథమిక పాఠశాలలను ఆధునికీకరించామన్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తికావస్తోందన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పుంత రోడ్డు నిర్మించామని, వాటిని గ్రావెల్‌ రోడ్లుగా త్వరలో మార్చుతామని తెలిపారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరయ్యయన్నారు. వీటితో మధుపేటలో, కుమ్మరిపేటలో రూ.15 లక్షల వ్యయంతో విద్యుత్‌ స్తంభాల మార్పిడి, ఇతర కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ఎర్రచెరువు, సాగునీటి చెరువు నుంచి రైతులకు సాగునీరు తరలించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేందుకు వ్యక్తిగతంగా చెరువు షట్టర్లను బాగు చేయడం, అనుసంధాన కాలువలను ఆధునికీకరించడం చేశామన్నారు. పోలవరం కాలువ నుంచి తరలుతున్న గోదావరి జలాలను తాగునీటిగా అందించేందుకు ఒక సాగునీటి చెరువు రిజర్వాయర్‌ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసేందుకు ఎంఎల్‌ఎ పుప్పాల వాసు బాబుతో పాటు గ్రామ పంచాయతీ యాజమాన్యం సహాయ సహకారాలు అందజేస్తున్నారని వివరించారు.

➡️