మండవల్లి : రోడ్డు ప్రమాదాలు సంభవించే విధంగా రహదారుల వెంబడి విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన అనుమతులు లేని ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల అధ్యక్షులు టి.అప్పారావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ రాజకుమార్‌కు అనధికార ఫ్లెక్సీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 165పై ఎక్కడబడితే అక్కడ అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నారు. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికుల దృష్టి మరలి ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుని, రహదారి ప్రమాదాల నుంచి వాహనదారులను, ప్రజలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఎస్.భాస్కరరావు పాల్గొన్నారు.
