ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

సమస్యాత్మక కేంద్రాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి ఖజావలి
ప్రజాశక్తి – భీమడోలు
భీమడోలు మండలంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించిన గ్రామాల్లో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి గురువారం పర్యటిం చారు. దీనిలో భాగంగా చెట్టున్నపాడు, ఆగడాలలంక, అంబరుపేట, లింగం పాడు గ్రామాల్లో ఎనిమిది సమస్మాత్మక పోలింగ్‌ బూత్‌లను సందర్శించారు. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను పరిశీలించారు. చెట్టున్నపాడు గ్రామంలోని పోలింగ్‌ బూత్‌లోని ఒక గదిలో నిరుపయోగంగా ఉన్న సామగ్రి ఉండటం గమనించి వాటిని తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగిం చుకో వాలని కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని 3204 మంది వికలాంగులు, 85 ఏళ్లు పూర్తి చేసుకున్న 982 మంది వయోవృద్ధ ఓటర్లు ఓటు హక్కును ప్రత్యేక పరిస్థితుల్లో వినియోగిం చుకునే విషయమై పరిశీలిస్తున్నామన్నారు. ఇదే విషయమై భీమడోలు మండలంలో 300కు పైబడి వికలాంగులు, 200కు పైగా వయోవృ ద్ధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. ఆయన చెట్టున్నపాడు గ్రామ పర్యటనలో ఉండగా గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకట్రావు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆర్‌డిఒ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు తహశీల్దార్‌ వరాహలయ్య, ఎంపిడిఒ స్వర్ణలత పాల్గొన్నారు.

➡️