తాగునీటి సంపు.. బట్టలు ఉతికే బండగా..!

ప్రజాశక్తి – మండవల్లి

సర్పంచి పర్యవేక్షణ లోపం, కార్యదర్శి నిర్లక్ష్యం మండవల్లి ప్రజల పాలిట శాపంగా మారిందని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కొండరాయి చెరువు వద్ద ఉన్న సంపు బట్టలు ఉతికే బండగ మారిపోయిందని విమర్శిస్తున్నారు. కాసుల సంపాదనపై ఉన్న శ్రద్ధ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో లేకపోవడంతో బట్టల్లోని మురుగు సంపులో ఉన్న నీటితో కలుస్తున్నాయి. దీంతో వ్యాధులు ప్రభలుతాయని గ్రామస్తులు భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామస్తులకు దాహార్తిని తీర్చే విధంగా స్టేషన్‌ సెంటర్‌ కొండరాయి చెరువు వద్ద 60 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి పథకాన్ని నిర్మించారు. కార్యదర్శి, సర్పంచి పర్యవేక్షణ కొరవడంతో స్థానికులకు పథకం వద్దనున్న సంపు బట్టలు ఉతుక్కునే బండరాయిగా మారిపోయింది. ఈ విషయంపై సర్పంచి, కార్యదర్శి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. జలజీవన్‌ మిషన్‌ ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్పంచి, కార్యదర్శిపై చర్యలు తీసుకుని స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఇఒపిఆర్‌డి ఆనంద్‌ బాబును వివరణ కోరగా పరిశీలించి కార్యదర్శిపై చర్యలు తీసుకుంటానని అన్నారు.

➡️