పంటనష్టం నమోదు : ఎడి

ప్రజాశక్తి – భీమడోలు

మండల పరిధిలో పంట నష్టం నమోదు కార్యక్రమం సోమవారం ప్రారంభమైందని ఎడి ఉషారాణి తెలిపారు. నమోదు కార్యక్రమానికి ప్రత్యేక సర్వే బృందాల నియామకం జరిగిందన్నారు. దీనిలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారన్నారు. వీరు ఎడితో పాటు తహశీల్దార్‌ పర్యవేక్షణలో పనిచేస్తారని వివరించారు. తుపాను కారణంగా 1,200 ఎకరాల విస్తీర్ణంలో పంట మునిగిపోవడం, ఇతర కారణాల వల్ల నష్టపోవటం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు ఉన్నాయన్నారు. వీటి ఆధారంగా ప్రస్తుతం పంట నష్టం నమోదు సర్వే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రానున్న రెండు రోజులు సర్వే కార్యక్రమం పూరైన తర్వాత వివరాలను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. మండల పరిధిలో ఖరీఫ్‌ సీజన్‌లో 34 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇంతవరకు 18,816 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. రైతులు వేగవంతంగా ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన గోనె సంచులను సిద్ధంగా ఉంచామని, రవాణా కోసం వాహనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇంకనూ మండల పరిధిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో కోతలు పూర్తి కావాల్సి ఉందని, దీనిలో వెయ్యి ఎకరాల వరకు పంట నీట మునిగిందన్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు రక్షణ చర్యలు చేపట్టారని వివరించారు. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రానికి తుపాన్‌ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రైతులు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకొని, ఈనెల 15లోగా కోతలను పూర్తి చేసి ఆరబెట్టుకోవటం, మిల్లులకు తరలించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

➡️