మండవల్లి : మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్.భాస్కరరావు, టి.అప్పారావు కోరారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో తహశీల్దార్ రాజ్‌కుమార్‌కు వినతిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 22 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు వైద్య సేవలందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆవిధంగా నేటికీ నిర్వహించకపోవడం బాధాకరమని అన్నారు. కైకలూరు నియోజకవర్గంలోని కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి మండలాల్లో ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు పనిచేస్తూ రోగులకు వైద్య సేవలు అందిస్తుండగా కేవలం మండవల్లి మాత్రమే ఎనిమిది గంటలు అది కూడా అసంపూర్తిగా విధులు నిర్వహిస్తున్న పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. అత్యవసర సమయాల్లో, రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నైట్ వాచ్‌మెన్ ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యశాలలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షులు టి.అప్పారావు, బండి రంగారావు పాల్గొన్నారు.
