టిడిపి, జనసేనలో ఆరని అసమ్మతి సెగలు
ఎన్నికల్లో సహకరించేది లేదంటూ నాయకుల ఘీంకారాలు
ఓట్లు బదలాయింపు జరిగేనా అంటూ తీవ్ర చర్చ
ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెంల్లో ఇదే పరిస్థితి
బిజెపి సీట్లు ప్రకటిస్తే మరో రచ్చ ఖాయం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
జిల్లాలో టిడిపి, జనసేన పొత్తు ఫలించేనా అనే చర్చ సాగుతోంది. ఎన్నికల్లో ఓట్ల బదలాయింపు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టిక్కెట్ల కేటాయింపు తర్వాత టిడిపి, జనసేనలో చోటుచేసుకున్న పరిణామాలు అందుకు అద్ధం పడుతున్నాయి. టిడిపి, జనసేన నాయకుల అసమ్మతి రాగాలు ఏ పరిస్థితికి దారి తీస్తాయోననే ఆందోళన ఆయా పార్టీల నాయకుల్లో వ్యక్తమవుతోంది. 2024 సాధారణ ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తుతో ముందుకు సాగాలని ఆ పార్టీ అధినాయకులు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నిర్ణయించారు. టిడిపి, జనసేన పొత్తును రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా టిక్కెట్ల కేటాయింపు ప్రకటన తర్వాత పరిస్థితి తారుమారైంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టిడిపి, జనసేన అభ్యర్థుల తొలి జాబితాలో ఏడు స్థానాలను టిడిపి ప్రకటించింది. తణుకు సీటు టిడిపి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో జనసేన టిక్కెట్ ఆశించిన విడివాడ రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెంలో జరిగిన టిడిపి, జనసేన ఉమ్మడి ఎన్నికల సభ ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బస వద్ద ఆయన తన అనుచరులతో ఆందోళనకు సైతం దిగారు. విడివాడకు అన్యాయం చేశారని, టిడిపికి సహకరించేది లేదని నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు సీటు టిడిపి అభ్యర్థి బడేటి చంటికి కేటాయించడంతో జనసేన టిక్కెట్ ఆశించిన రెడ్డి అప్పలనాయుడు ఇదే విధమైన నిరసన తెలిపారు. వీరు ఇరువురు వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జనసేన ఓట్లు టిడిపికి బదలాయింపు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఎన్ని ఓట్లు చీల్చినా అవి పార్టీకి సంబంధించిన ఓట్లే కావడం వల్ల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభ్యర్థుల రెండోజాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రెండు జిల్లాల్లో మిగిలిన ఏడు స్థానాల్లో నరసాపురం, భీమవరం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, పోలవరం మొత్త ఐదుస్థానాలు జనసేనకు కేటాయించినట్లు స్పష్టత వచ్చింది. ఈ స్థానాల్లో టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న వారితో శుక్రవారం చంద్రబాబు ఢిల్లీ నుంచి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. టిక్కెట్ రాకపోవడంతో ఉంగుటూరు నేత గన్ని వీరాంజనేయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక జనసేన అభ్యర్ధికి పదివేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. టిడిపి అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించారు. టిడిపి ఓట్లన్నీ జనసేనకు బదిలీ అయితేనే జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. తీవ్ర అసంతృప్తిలో ఉన్న టిడిపి నేతలు జనసేన అభ్యర్థికి సహకరిస్తారా.. ఓట్లు బదిలీ జరిగేలా ప్రచారం నిర్వహిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. పోలవరం టిక్కెట్ జనసేనకు కేటాయించినట్లు స్పష్టత వచ్చింది. టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న బొరగం శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. శనివారం పోలవరం నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బుట్టాయిగూడెంలో సమావేశమై పోలవరం టిక్కెట్ కేటాయింపుపై సరైన నిర్ణయం తీసుకోవాలని, ఐదు శాతం ఓట్లులేని జనసేనకు ఏవిధంగా కేటాయిస్తారని అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీటు బొరగం శ్రీనివాస్‌కు కేటాయించకపోతే ఎన్నికల్లో సహకరించేది లేదన్నట్లు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఎన్నికల్లో పొత్తు ఫలించేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం టిక్కెట్ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌కు కేటాయించినట్లు స్పష్టత రావడంతో టిడిపి టిక్కెట్ ఆశించిన వలవల బాబ్జీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నాయకుల మాటలను పరిశీలిస్తే ఎన్నికల్లో జనసేనకు ఇక్కడ టిడిపి నాయకుల నుంచి సహకారం ఉంటుందా అనే మీమాంస నెలకొంది. టిడిపి, బిజెపి, జనసేన పొత్తు ఖాయమవ్వడంతో బిజెపికి ఏ అసెంబ్లీ స్థానం కేటాయిస్తారా అనే చర్చ నడుస్తోంది. బిజెపికి టిక్కెట్ కేటాయిపు తర్వాత సైతం అసమ్మతి సెగలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇరుపార్టీల్లో అసమ్మతి నేతలను బుజ్జగించి దారిలోకి తెస్తారో.. లేక ఇబ్బందులు తప్పవో అనే చర్చ పెద్దఎత్తున సాగుతోంది.
