సేవ.. అభివృద్ధే నా లక్ష్యం

సొంతూరిపై మమకారంతో అమెరికాను వీడా

మిషన్‌ హోప్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా పలు సేవలు

ఒక్క అవకాశమిస్తే ‘చింతలపూడి’ని అభివృద్ధి చేస్తా

టిడిపి యువ నేత సోంగా రోషన్‌ కుమార్‌

ప్రజాశక్తి – చింతలపూడి

కుల, మతాల పట్టింపు లేకుండా మిషన్‌ హోప్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా చింతలపూడి నియోజకవర్గ పరిధిలో అనేక మందికి సాయం అందించడంతోపాటు విద్య, వైద్యం చేరువ చేసి, యువతకు ఉపాధి కల్పన, మహిళలను ఆర్థికంగా బలపర్చేలా కుటీర పరిశ్రమలు తీసుకురావడమే తన లక్ష్యమని టిడిపి యువ నేత, మిషన్‌ హోప్‌ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సోంగా రోషన్‌కుమార్‌ చెప్పారు. మన ఊరు-మన వ్యాపారం ద్వారా యువత ఆర్థికంగా బలపడేటట్లు సేవలందిస్తున్నానని వివరించారు. తనకు ఎంఎల్‌ఎగా అవకాశమిస్తే చింతలపూడి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఆయన ప్రజాశక్తి నిర్వహించిన చిట్‌చాట్‌లో పలు అంశాలపై మాట్లాడారు.ప్రశ్న: మీ సొంతూరు ఎక్కడ ? నాది చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం ధర్మాజీగూడెం సొంతూరు. నాన్న సోంగా రాజారత్నం, అమ్మ డాక్టర్‌ వెలిమర్తి రాజ్యలక్ష్మి. నా తల్లిది చింతలపూడిలోని సుప్రింపేట. మా కుటుంబంలో అంతా ఉద్యోగస్తులే.ప్రశ్న: రాజకీయాల్లోకి రావడానికి కారణం? చిన్న వయస్సులోనే అమెరికా వెళ్లాను. అక్కడ అభివృద్ధి బాగుంది. నేను చింతలపూడి వచ్చినప్పుడు గతంలో ఊరు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఎటువంటి అభివృద్ధీ కన్పించలేదు. రోడ్లు, పరిశ్రమలు లేవు. యువత పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం వేరే చోటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ వెనుకబాటును చూసి రాజకీయాల్లోకి రావాలనిపించింది. సరైన విద్య, వైద్య సదుపాయాలు లేవు. పంటలకు నీరు లేదు. ఉదాహరణకు మల్లేశ్వరం గ్రామంలో 600 ఎకరాల భూమి ఉంది. అయితే సాగునీరు లేక పంట పండించలేని దుస్థితి నెలకొంది. వంద పడకల ఆస్పత్రి పూర్తి కాని పరిస్థితి. ప్రతి పేద కుటుంబానికి విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు అందడం లేదు. అందుకే మార్పు కోసం నా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా వదిలి స్వగ్రామం వచ్చాను.ప్రశ్న: చింతలపూడి నియోజకవర్గాన్ని ఏవిధంగా అభివృధ్ధి చేయాలనుకుంటున్నారు? చింతలపూడి నియోజకవర్గాన్ని వైద్యం, విద్య, ఉపాధి కల్పనలో మొదటి స్థానంలో ఉంచాలనేది నా లక్ష్యం. యువత పోటీ పరీక్షలకు కోచింగ్‌ కోసం ఎక్కడో ఉన్న అవనిగడ్డ, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లేకంటే చింతలపూడిలోనే ఉత్తమ ఫ్యాకల్టీతో కోచింగ్‌ ఇప్పించి ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తాను. డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తా. యువతను చెడు వ్యసనా లకు దూరంగా ఉంచి జ్ఞానాన్ని పెంచుకు నేలా చేస్తా. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారు లను ప్రోత్సహించాలి. అల్లిపల్లి వంటి క్షేత్రాల ను ప్రసిద్ధ క్షేత్రాలుగా మార్చి అభివృద్ధి చేయాలి. స్వయం ఉపాధి కల్పించాలి. సంపదను సృష్టించాలి. వ్యాపా రాలు అభివృద్ధి చెందాలంటే రోడ్ల సదుపాయం, బస్సు సౌకర్యం ఉండాలి. వాటిపై ప్రత్యేక దృష్టి పెడతాను. చింతలపూడికి బస్సు డిపో కచ్చితంగా తీసుకొస్తాను. వ్యాపార సంస్థలను ఆహ్వానిస్తాను. వ్యాపార సంస్థలు వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.ప్రశ్న: యువతకు మీరు ఏం చెబుతారు? యువత ఆలోచించాలి. ఇప్పటి వరకు అభివృద్ధి జరిగిందా, లేదా అనేది తెలుసుకోవాలి. నాకు ఎటువంటి పదవులూ, అధికారం లేకుండానే మిషన్‌ హోప్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. మంచికి అండగా ఉండండి. నిజాయతీపరులకు మద్దతివ్వండి. ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాను. నేను ఒకటి అనుకుంటే అది జరిగే వరకు వదిలిపెట్టను. ఏదైనా అభివృద్ధే నా లక్ష్యం. డబ్బు మీద ఆశ లేదు, సంపాదించాలనే కోరిక లేదు. రాజకీయాల్లో కంటే నేను అమెరికాలోనే ఎక్కువ సంపాదిస్తాను. నియోజకవర్గ అభివృద్ధి యువత చేతుల్లోనే ఉంది. మీలో మార్పు నియోజకవర్గ అభివృద్ధికి నాంది కావాలి.ప్రశ్న: మన ఊరు-మన వ్యాపారం లక్ష్యం ఏమిటి? మన ఊరు-మన వ్యాపారం ద్వారా యువత తన సొంత కాళ్లపై నిలబడేలా చిరు దుకాణాలు పెట్టుకోవడానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాను. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాంటి నిరుద్యోగ యువత ఆర్థికంగా బలపడేలా చేస్తున్నాను. అదేవిధంగా ఆటో యూనియన్‌ వారికి 50 నుంచి 60 మంది వరకూ యూనియన్‌ తరపున రూ.లక్ష ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాను. వారు అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇవి వాడుకొని, మళ్లీ అక్కౌంట్‌లో వేసే విధంగా.. వారి అవసరాలకు విని యోగించుకునేలా చేస్తు న్నాను.ప్రశ్న: టిడిపి టిక్కెట్‌ లభిస్తే మీకే ఓటు ఎందుకు వేయాలి? మాది రాజకీయ కుటుంబం కాదు. నా సంపాదన, నా భార్య సంపాదనలో 10 శాతం పేదలకు ఇవ్వాలనే సంకల్పంతో మిషన్‌ హోప్‌ స్వచ్చంద సంస్థను స్థాపించాను. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశాం. నియోజకవర్గంలో కుల, మత భేదాలు లేకుండా, అవసరమున్న వారికి ఆర్థికంగా సాయం చేశాను. కేన్సర్‌తో బాధపడుతున్న వారికి ఉచిత మెడికల్‌ క్యాంప్‌ మణిపాల్‌ హస్పిటల్‌ వారిచే పెట్టించి ఎనిమిది వేల మందికి సేవలందించాను. నియోజకవర్గంలో పలు మెడికల్‌ క్యాంప్‌లు పెట్టించాను. కరోనా సమయంలో మిషన్‌ హోప్‌ టీమ్‌ ద్వారా ప్రయివేట్‌ టీచర్లు, మహిళలకు ప్రతిగ్రామంలో నిత్యావసర సరుకులు అందజేశాం. ఎటువంటి పనీ చేయలేకపోతున్న 40 మందికి పెన్షన్‌ అందిస్తున్నాం. పూర్తిగా ఉపాధి లేని, పని చేయలేని 15 మందికి ఇప్పటికీ నెలకు రూ.5 వేలు పెన్షన్‌ అందజేస్తున్నాను. బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారులకు నెలకు రూ.10 వేలు చొప్పున అందించాను. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇది అంతా సేవ చేయాలనే తపనతో చేశాను. అదే అధికారం ఉంటే అందరికీ సేవ చేసే అవకాశం లభిస్తుంది.ప్రశ్న: నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే సందేశం? మంచికి ఓటు వేయండి. నిజాయతీని గెలిపించండి. అభివృద్ధికి మీ ఓటుతో స్వాగతం పలకండి. పలావు, సారా, మద్యం, డబ్బుకి మీ ఓటును అమ్ముకుంటే, ఐదు సంవత్సరాల అభివృద్ధిని దూరం చేసుకున్నట్టే. మీ ఓటు మన భావితరాల భవిష్యత్తుకు పునాది అని గుర్తుపెట్టుకోండి.

➡️