16న గ్రామీణ భారత్‌ బంద్‌ జయప్రదానికి పిలుపు

Feb 11,2024 17:50

కరపత్రాలు ఆవిష్కరించిన ప్రజాసంఘాల నేతలు
ప్రజాశక్తి – కొయ్యలగూడెం
ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్త సంయుక్త కిసాన్‌ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపుమేరకు నిర్వహిస్తున్న గ్రామీణ భారత్‌ బంద్‌ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు అధ్యక్షతన రైతు సంఘం, రైతు కూలీ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్లబోయిన రాంబాబు, రైతు సంఘం జిల్లా నాయకులు జమ్మి శ్రీనివాస్‌, రైతు కూలీ సంఘం నాయకులు సద్గురుడు, మడకం రామన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుదే శ్రీను, జనా జగ్గారావు, ప్రజా సంఘాల నేతలు కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ కార్పొరేట్‌ మతతత్వ విధానాలను ప్రతికఘటిద్దామని, కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిద్దామన్నారు. బిజెపి అధికారంలోకొస్తే ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగం గత 50 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందన్నారు. శ్రామికుల నిజ వేతనాలు 20 శాతం తగ్గిపోయాయన్నారు. నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్‌ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయన్నారు. 2023లో పాలకులు కార్పొరేట్లకు రూ.2.14 లక్షల కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేశారన్నారు. 2019-2022 మధ్యకాలంలో ఒక శాతం ఉన్న బడా కార్పొరేట్ల వాస్తవ ఆదాయం 30 శాతం వృద్ధి చెందగా పేదల వాస్తవ ఆదాయం 11 శాతానికి పడిపోయిందన్నారు. ధరలు కనివిని ఎరుగని రీతిలో 30 నుంచి 56 శాతం వరకు పెరిగాయన్నారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదవారి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్‌ చేస్తామన్న హామీని మర్చిపోయారన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందన్నారు. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవాలని ప్రయత్నిస్తుందన్నారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల రైస్‌మిల్‌ బజాజ్‌ జట్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.శివకుమార్‌, ఎఐటియుసి నాయకులు వి.నాని, పిల్ల తమ్మారావు, మర్రి త్రిమూర్తులు, జి.గోపీ పాల్గొన్నారు.

➡️