కోతకు గురైన జాతీయ రహదారి

ప్రమాదపుటంచున వాహనదారులు

ప్రజాశక్తి – ముదినేపల్లి

పామర్రు-దిగమర్రు 165 జాతీయ రహదారిలో ముదినేపల్లి హై స్కూల్‌ ఎదురుగా జాతీయ రహదారి కోతకు గురైంది. ముదినేపల్లి నుంచి కైకలూరు వెళ్లే రోడ్డులో పోల్‌రాజ్‌ ప్రధాన పంట కాలువ నీటి ప్రవాహానికి రోడ్డు మార్జిన్‌ పూర్తిగా కోతకు గురైంది. హైస్కూల్‌ ఎదురుగా జాతీయ రహదారి కోతకు గురై 20 ఏళ్లు పైబడినా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. రహదారి కోతకు గురైన ప్రాంతంలో అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. రోడ్డు మార్జిన్‌ పూర్తిగా కాలువలో కలిసిపోయి రోడ్డు అండలుగా విరిగిపోయి కాలువలో పడిపోతుంది. ఈ కారణంగా ఆ ప్రాంతం పెద్ద గుంతగా తయారైంది. అంతేకాక ఈ ప్రాంతంలో దట్టంగా ముళ్ల పొదలు పెరిగిపోవడంతో కోతకు గురైన ప్రాంతం వాహనదారులకు కనిపించడం లేదు. దీంతో ఈ రహదారిలో ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక రాత్రి సమయాల్లో ఈ రహదారుపై రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మార్జిన్‌ కోతకు గురైన ప్రాంతం ఎదురుగా హైస్కూల్‌ ఉండడంతో తరచూ పిల్లలు ఈ కాల్వ కోత గురైన ప్రాంతంలో ఆడుకునేందుకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా నేషనల్‌ హైవే అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు జరగక ముందే రోడ్డు కోత గురైన ప్రాంతంలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

➡️