ఆధునికీకరణకు పాతర..!

డెల్టాలో కాలువల పరిస్థితి దారుణం
పూడుకుపోవడంతో దిగువకు పారని నీరు
ఈ ఏడాదీ చిల్లిగవ్వ పనులు చేపట్టని వైనం
ఆధునికీకరణ పనులకు తిలోదకాలిచ్చిన వైసిపి సర్కార్‌
ప్రతియేటా సాగునీటి కోసం రైతుల అగచాట్లు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ప్రభుత్వం డెల్టా ఆధునికీకరణకు పూర్తిగా పాతరేసింది. దీంతో గడిచిన ఐదేళ్లుగా జిల్లా రైతాంగం పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ ఏడాది వేసవిలో సైతం చిల్లిగవ్వ పని చేయకుండా చేతులెత్తేసిన పరిస్థితి. పాలకుల నిర్లక్ష్యంతో ప్రతియేటా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాలు ఉండగా 29 మండలాల్లో డెల్టా ప్రాంతం విస్తరించి ఉంది. గోదావరి నుంచి 11 ప్రధాన కాలువలు, 300కుపైగా పిల్ల కాలువల ద్వారా పంటలకు సాగునీటి సరఫరా జరుగుతోంది. ఉమ్మ డి జిల్లాలో డెల్టా పరిధిలో మొత్తం 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో 4.60 లక్షల ఎకరాలు వరి విస్తీర్ణం ఉండగా, మిగిలిన భూముల్లో చేపల చెరువులు, ఉద్యాన పంటలు ఉన్నాయి. గోదావరి డెల్టా పరిధిలో ఖరీఫ్‌, రబీలో సైతం వరిసాగు తప్ప రైతులకు వేరే ప్రత్యామ్నాయం లేకుండాపోయింది. 2007లో జిల్లాలో డెల్టా ఆధుని కీకరణకు రూ.1,464 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దశాబ్ధన్నర కాలం గడిచినా ఇప్పటికీ డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తికాని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకూ రూ.800 కోట్లు మేర పనులు జరిగాయి. ఇంకా దాదాపు రూ.600 కోట్లు విలువ చేసే పనులు జరగాల్సి ఉంది. చేసిన పనుల్లో సైతం నాణ్యత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికక్కడే కాలువలు మెరకదేరిపోయాయి. షట్టర్లు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాలువలు మెరకదేరడంతో సాగునీరు దిగువకు పారడం లేదు. దీంతో ఉండి, నరసాపురం వంటి ప్రాంతాల్లో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రతియేటా కొన్ని పనులైనా జరిగేవి. వైసిపి ప్రభుత్వం వచ్చాక డెల్టా ఆధునికీకరణ పనులను పూర్తిగా పక్కన పెట్టేసింది. కాలువల నుంచి తట్ట మట్టి తీసిన దాఖలాల్లేవు. నవంబర్‌లో జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాల్లో డెల్టా ఆధునికీకరణ గురించి మంత్రులు, అధికారులు ఉపన్యాసాలు ఇవ్వడంతోనే సరిపోయింది. డిసెంబర్‌ నెలాఖరుకు ప్రతిపాదనలు తయారు చేసి జనవరి నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని, కాలువలు మూసిన వెంటనే పనులు ప్రారంభించాలని సమావేశాల్లో ఊదరగొట్టేవారు. ఇరిగేషన్‌ అధికారులు ప్రతియేటా రూ.300 కోట్ల విలువ చేసే పనులకు ప్రతిపాదనలు పంపినా ఒక్కసారి కూడా ప్రభుత్వం ఆమోదించిన పరిస్థితి లేదు. ఈ ఏడాది సైతం ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఆమోదం లభించలేదు. దీంతో ఆధునికీకరణ పనులు ఎక్కడా జరగకుండా పోయాయి. ఈ ఏడాది వర్షాలు లేకుండా ఆధునికీకరణ పనులకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ పనులు మాత్రం జరగని పరిస్థితి ఉంది.ప్రతియేటా వేలాది ఎకరాల్లో దెబ్బతింటున్న పంటలు ఆధునికీకరణ లేక కాలువలు మెరకదేరిపోవడంతో ప్రతియేటా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. చిన్నపాటి వర్షాలకు సైతం పొలాల నుంచి నీరు కిందకు పారడం లేదు. దీంతో నారుమడులు దెబ్బతినడం ప్రతియేటా పరిపాటిగా మారింది. మాసూళ్ల కాలంలో అకాల వర్షాలతో పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండిపోయి వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింటోంది. రబీలో ప్రతియేటా నీటిఎద్దడి తలెత్తడం, వంతులవారీ విధానంలో నీటి పంపిణీ సాగుతోంది. కాలువలు పూడుకుపోయి సాగునీరు దిగువన ఉన్న పొలాలకు అందక రైతులు మోటారు ఇంజిన్లు, ఇతర వాటిపై ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. డెల్టా ఆధునికీకరణపై పాలకులు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

➡️