లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు

Mar 12,2025 21:02 #Eluru district, #road accident
  • 11 మందికి గాయాలు

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ : ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయిన ఆర్‌టిసి బస్సు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఏలూరు జిల్లా నగర శివారులోని రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. ఏలూరు మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు మంగళవారం రాత్రి కాకినాడ నుంచి గుంటూరుకు బయలుదేరింది. బస్సు తెల్లవారుజామున 4:30 సమయంలో ఏలూరు జాతీయ రహదారిలోని రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాల సమీపానికి చేరుకునేసరికి ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి అదే లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో సహా మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలపాలైన వారిని 108 వాహనాల్లో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో గంటన్నర పాటు విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రెండు గంటలు శ్రమించి బస్సును లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎపిఎస్‌ ఆర్‌టిసి జోనల్‌ చైౖర్మన్‌, బోర్డు డైరెక్టర్‌ రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

➡️