ఏలూరు స్పోర్ట్స్ : మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పించేందుకు జిల్లా ఎస్‌పి ఆదేశాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన అభయ మహిళా రక్షక దళ సభ్యులు నగరంలో గస్తీ నిర్వహించారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో మహిళా ఎస్‌ఐ కాంతి ప్రియ, ఏలూరు టూ టౌన్ మహిళా ఎస్‌ఐ నాగ కళ్యాణి జిల్లాలో ఉన్న అభయ రక్షక మహిళా దళం ఏలూరు నగరంలో గస్తీ నిర్వహించారు. ఎస్‌పి ఆదేశాలతో ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం సబ్ డివిజన్లలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గస్తీ ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలు నిరోధించడమే లక్ష్యంగా అభయ రక్షక మహిళ దళ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్‌టిసి బస్సులు, కాలేజీ బస్సులలో ప్రయాణం చేస్తున్న విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఆకతాయిలు మహిళలపై వేధింపులకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని సిఐ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని కోరారు.
