కంపెనీలకు అండగా.. రైతులకు వ్యతిరేకంగా..!

జిల్లా ఉద్యా శాఖ అధికారుల తీరుపై రైతుల ఆవేదన
కోకో రైతుల ధర సమస్యపై అధికారుల తీరు వివాదాస్పదం
అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం కోకో ధర అమలులో విఫలం
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ధరపై ప్రచారం
నాణ్యత పేరుతో కంపెనీల దోపిడీకి అధికారులు అండ
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
కోకో రైతులకు అండగా పని చేయాల్సిన జిల్లా ఉద్యాన శాఖ అధికారులు.. అందుకు విరుద్ధంగా కోకో పంటను కొనుగోలు చేసే కంపెనీలకు సలాం కొడుతూ అన్నదాతను దెబ్బతీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన చర్చలు, నిర్ణయాలను సైతం లెక్క చేయకుండా కంపెనీలకు అండగా జిల్లా ఉద్యాన శాఖాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లా ఉద్యాన శాఖాధికారుల తీరుతో కడుపు మండిన కోకో రైతులు ఆ శాఖ జిల్లా కార్యాలయంలోనే బైఠాయించి నిరసన తెలిపారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. గతం లో లేని నాణ్యత నిబంధనలు తెరపైకి తెచ్చి కంపెనీలు చేస్తున్న దోపిడీకి జిల్లాలోని ఉద్యాన శాఖాధికారులు అండగా నిలుస్తూ వంతపాడుతున్న తీరు రైతులను విస్మయానికి గురిచేస్తోంది. కోకో రైతుల సమస్యలపై రాష్ట్రస్థాయి అధికారులు చూపిస్తున్న చొరవ కూడా జిల్లా అధికారులు చూపించకపోవడం అందుకు నిదర్శనమని రైతులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో కోకో సాగవుతుండగా, జిల్లాలోనే 33 వేల ఎకరాల్లో సాగవుతోంది. కోకోకు అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగా ధర నిర్ణయం ఉంటుంది. గతేడాది కిలో కోకో గింజలు ధర రూ.వెయ్యికిపైగా పలికింది. ఈ ఏడాది ప్రస్తుతం కోకో గింజల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.750 వరకూ ఉంది. కంపెనీలు మాత్రం రైతులకు అందుకు తగిన ధర ఇవ్వడం లేదు. పాత గింజలైతే కిలో రూ.300లోపే కొనుగోలు చేస్తున్నారు. దీనిపై కలెక్టరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించగా కంపెనీలను పిలిచి మాట్లాడతామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా మార్చి 13న జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎస్‌.రామ్మోహన్‌ రైతులతోనూ, కంపెనీలతో చర్చించారు. పాత గింజలు 700 టన్నులకుపైగా ఉన్నాయని, కొనుగోలు చేయాలని కోరారు. పాత, కొత్త గింజలతో సంబంధం లేకుండా కిలో రూ.600కు కొనుగోలు చేస్తామని కంపెనీలు ఆ రోజు చెప్పాయి. కొనుగోలు మాత్రం చేయలేదు. దీంతో మార్చి 17న అమరావతిలో ఉద్యావనశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌ సమక్షంలో మరోసారి చర్చలు జరిగాయి. అక్కడ సైతం ఇదే హామీ ఇచ్చారు. మార్చి 20న విజయరాయిలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కోకో రైతులు ఆందోళన బాట పట్టారు.ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యాన శాఖ జిల్లా అధికారులు..! ఏప్రిల్‌ మూడో తేదీన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు సమక్షంలో మరోసారి కోకో రైతులు, కంపెనీలతో చర్చలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కోకో గింజలను కొనుగోలు చేయాలని మంత్రి సైతం చెప్పారు. 3;1 నిష్పత్తిలో మూడు క్వింటాళ్లు కొత్త గింజలు కొనుగోలు చేస్తే, ఒక క్వింటా పాత గింజలు కొనుగోలు చేసేలా నిర్ణయించారు. కిలోకు రూ.550 ధర ఇచ్చేలా కంపెనీలు ఒప్పుకున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తానని చెప్పింది. ప్రభుత్వ ప్రకటన రాకముందే ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన నాణ్యత ఉన్న కోకో గింజలు పాతవి కిలో రూ.300, కొత్త గింజలు రూ.550కు కొనుగోలు చేయనున్నట్లు మోడలైజ్‌ కంపెనీ తెలిపినట్లు ఉద్యాన శాఖాధికారులు వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టారు. అసలు కిలో రూ.300 ధర అనేది కోకో రైతులతో జరిగిన ఏ చర్చల్లోనూ నిర్ణయం జరగలేదు. మరి ఉద్యాన శాఖాధికారులు ఏవిధంగా ప్రకటించారో అర్థం కాని పరిస్థితి. పాత గింజలు 700 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కిలోకు రూ.250 నష్టపోతే రైతులకు ఎంతమేర నష్టం వస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. ఉద్యాన శాఖాధికారులు కంపెనీలకు అండగా తక్కువ ధర నిర్ణయిస్తూ ప్రకటన చేయడంపై కోకో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతోజిల్లా కార్యాలయం లోపల బైఠాయించి ఆందోళన చేపట్టారు. అప్పుడు సైతం జిల్లా ఉద్యాన అధికారులు కంపెనీలకు అండగా మాట్లాడుతూ రైతులు ఇష్టమైతే అమ్ముకుంటారని వాదనకు దిగడం గమనార్హం. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ ఫేక్‌ అని, దీనిపై ప్రకటన ఇస్తామంటూ రైతులకు చెప్పారు. ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే అధికారులు చేశారని అర్థమవుతోంది. కంపెనీలకు కొమ్ముకాస్తూ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు కావాలనే డ్రామా అడుతున్నారనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యాన శాఖాధికారులు పదే పదే గతంలో ఎన్నడూ లేని నాణ్యత గురించి మాట్లాడటం, కంపెనీలకు అనుకూలంగా మాట్లాడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

➡️