‘అపరాల’ అగచాట్లు..!

ధర లేక, దిగుబడి రాక రైతుల ఆవేదన
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర నిర్లక్ష్యం
ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు
పెసర క్వింటాకు దాదాపు రూ.1,480 నష్టపోతున్న అన్నదాత
రైతులను దోచేస్తున్న దళారులు
దిగుబడి తగ్గడంతో పెట్టుబడి ఖర్చులు రాని దుస్థితి
ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు భరోసా లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెసర, మినుము వంటి అపరాల సాగుచేసిన రైతులకు సరైన ధర దక్కక నష్టాలను చవిచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారుల ప్రకటనలతో సరిపెట్టడం తప్ప ఆచరణలో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో ముఖ్యంగా పెసర రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చూడాలంటూ అపరాల రైతులు వేడుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి వంటి మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున అపరాల సాగుచేపట్టారు. మిగిలిన ప్రాంతాల్లోనూ అపరాల పంటను రైతులు సాగు చేశారు. ఏలూరు జిల్లాలో 15,847 ఎకరాల్లో పెసర పంట, 23,437 ఎకరాల్లో మినుము పంటతోపాటు కందులు వంటి ఇతర అపరాల పంటలను దాదాపు 40 వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ ఏడాది చీడ పీడల నుంచి అపరాల పంటను కాపాడుకునేందుకు రైతులు గతంలో ఎన్నడూలేని విధంగా కష్టపడాల్సి వచ్చింది. రూ.వేలకు వేలు వెచ్చించి ఐదారు సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్తా రెండు, రెండున్నర క్వింటాళ్లు దాడడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కపక్క దిగుబడి తగ్గిపోగా, మరోపక్క పండిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కకపోవడం రైతులను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తోంది. మద్దతు ధర కోసం ఎదురుచూపులు అపరాల పంటల మాసూలు దాదాపు 90శాతంపైగా పూర్తయ్యాయి. పంట రైతుల వద్దే ఉంది. పెసరకు క్వింటాకు రూ.8,682 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం క్వింటాకు రూ.7,200 మాత్రమే ఇస్తున్నారు. దీంతో క్వింటాకు రూ.1480 వరకూ రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల దిగుబడి లెక్కించినా రైతులు ఎకరాకు రూ.3,700 వరకూ నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఐదెకరాల పెసర సాగుచేసిన రైతులు మద్దతు ధర దక్కక రూ.18,500 వరకూ నష్టపోతున్నారు. దీంతో రైతులు పండిన పంటను విక్రయించకుండా కళ్లాల్లోనే ఉంచారు. మినుము పంట విషయంలో కొంత పర్వాలేదనిపించినా పెసర రైతులు మాత్రం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఎకరాకు రూ.25 వేల వరకూ పెట్టుబడి పెట్టామని, ఒక పక్క దిగుబడి రాక, మరోపక్క సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్నానని రైతులు గగ్గోలుపెడుతున్నారు. అపరాల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ నెల ఏడో తేదీన జిల్లా అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరగలేదు.

➡️