గ్రంథాలయ నిర్మాణానికి స్థలం అప్పగించండి

వేసవి విజ్ఞాన శిబిరంలో ముగింపులో వక్తలు
ప్రజాశక్తి – భీమడోలు
భీమడోలు కేంద్రంగా శాఖా గ్రంథాలయం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దానికి అవసరమైన స్థలం కేటాయిస్తూ సంబంధిత శాఖ తీర్మానం చేసింది. అయినప్పటికీ స్థలాన్ని అప్పగించని కారణంగా సంవత్సరాలు తరబడి గ్రంథాలయానికి సొంతగూడు ఏర్పాటు జరగడం లేదు. ఇప్పటికైనా గ్రంథాలయం నిర్మాణానికి స్థలాన్ని అప్పగించాలని పలువురు వక్తలు కోరారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో 21 రోజులుగా బాలల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని శాఖా గ్రంథాలయంలో శనివారం నిర్వహించారు. గ్రంథపాలకులు కె.శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త మండే సుధాకర్‌ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌, విశ్రాంత ఉపాధ్యాయులు తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహణ సందర్భంగా బాలలకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు దాత బాలనాగు విజయసారథి సమకూర్చిన బహుమతులను అతిధుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బాలలకు శాఖా గ్రంథాలయం తరఫున ప్రశంసాపత్రాలను గ్రంథపాలకులు అందజేశారు. ఈ నేపథ్యంలో బాలలతో తాము చదువు కొనసాగించినంతకాలం టీవీలకు, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. వినియోగదారుల చట్టం ఫోరం జిల్లా ఛైర్మన్‌ ఎల్‌.మణికంఠ, ఇన్‌ఛార్జి జిల్లా అధ్యక్షులు పివివి.సత్యనారాయణ, పరిశీలకులు గంగాధరరావు మాట్లాడుతూ వినియోగదారుల చట్టం ప్రాముఖ్యత, అమలు తీరుపై అవగాహన కల్పించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఛక్ష్మిర్మన్‌ తుమ్మల ఉమామహేశ్వరరావు, గ్రంధ పాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గత సంవత్సరం నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు తాము నేర్చుకున్న పరిజ్ఞానం ద్వారా ఎంఎంఎస్‌ఎస్‌ జాతీయ ప్రతిభా పురస్కార అన్వేషణ) ఉపకార వేతనాల మంజూరు కోసం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు.

➡️