మరో 104 మంది విద్యార్థులకు అస్వస్థత

ట్రిపుల్‌ ఐటీలో ఇప్పటికీ మారని అధికారులు, మెస్‌ల నిర్వాహకుల తీరు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి
ప్రజాశక్తి – నూజివీడుటౌన్‌
నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో అధికారులు, మెస్‌ల నిర్వాహకుల తీరు మారకపోవడంతో శుక్రవారమూ విద్యార్థుల అస్వస్థత కొనసాగింది. మరో 104 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వగా వారిలో 102 మంది ఓపిలో చికిత్స పొందారు. మరో ఇద్దరు డయేరియా బారిన పడి కళాశాల ఆవరణలోని ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరారు. దీంతో గత వారం రోజుల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య వెయ్యి దాటింది.మెస్‌ల నిర్వహణా తీరుపై జెసి తీవ్ర ఆగ్రహం నూజివీడు ట్రిపుల్‌ ఐటిలోని మెస్‌ల నిర్వహణ తీరుపై ఏలూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె నూజివీడు ఆర్‌డిఒ వై.భవానిశంకరితో కలిసి శుక్రవారం కళాశాలలో పరిస్థితులను పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, పొందిన విద్యార్థుల నుండి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న చికిత్స గురించి వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. విద్యార్థులకు ఆహారం తయారు చేసే మెస్‌లను పరిశీలించారు. వాటి నిర్వహణ అధ్వానంగా, అపరిశుభ్రంగా ఉండడంతో జాయింట్‌ కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణంగా మెస్‌లను నిర్వహిస్తే విద్యార్థుల ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందని ప్రశ్నించారు. అపరిశుభ్రంగా మెస్‌లు నిర్వహిస్తున్న నిర్వాహకులపై తీసుకున్న చర్యలు ఏమిటని ట్రిపుల్‌ ఐటి పరిపాలనాధికారిని ప్రశ్నించారు. మెస్‌ల నిర్వహణ తీరు, ఆహారం తయారు చేసే పద్ధతిపై ఆమె విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఇదే పరిస్థితి గతంలో ఏర్పడినప్పుడు ఓ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులు 70 శాతం ఫీడ్‌ బ్యాక్‌ బాగుందని ఇస్తేనే మెస్‌ ఛార్జీలను ప్రభుత్వం చెల్లించేదని విద్యార్థులు తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితికి స్వస్తి పలికి సిబ్బంది 70 శాతం, విద్యార్థుల నుంచి కేవలం 30 శాతం ఫీడ్‌బ్యాక్‌గా నిర్ణయించడంతో తమ అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్‌ నిర్వాహకులు తప్పు చేస్తే జరిమానా విధిస్తున్నామంటూ అధికారులు చెప్పగా ఆ జరిమానాలతో తమకు ఒరిగిందేమిటని విద్యార్థులు సూటిగా ప్రశ్నించారు. జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి జోక్యం చేసుకుని మెస్‌ నిర్వాహకులపై వేసిన ఫైన్‌ సొమ్ముతో ఏం చేస్తున్నారని ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. దీంతో మెస్‌ నిర్వహకులు, విద్యార్థులతో జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.మెస్‌ల సక్రమ నిర్వహణకు ప్రణాళిక నూజివీడు ట్రిపుల్‌ ఐటిలో మెస్‌ల నిర్వహణ మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్దంగా కృషి చేయనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి శుక్రవారం రాత్రి తెలిపారు. ఆమె శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ మెస్‌లో తయారయ్యే ఆహారం, సరుకుల విషయంలో విద్యార్థులకు విధులు ఏర్పాటు చేసి భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రేషన్‌ బియ్యం, కుళ్లిన పదార్థాలను గుర్తించామని, దీనిపై తగిన చర్యలు చేపడతామని అన్నారు. వైఫై కావాలని విద్యార్థులు కోరిన మీదట మరో వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు ప్రతి ఆదివారం నిపుణులచే కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. మెస్‌ల్లో మరమ్మతులకు ఉన్నత విద్యాశాఖ నుంచి నిధులు కోరి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, మరికొన్నింటిని ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో అందించి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని చెప్పారు. జెసి వెంట నూజివీడు ఆర్‌డిఒ వై.భవానిశంకరి ఉన్నారు.

➡️