జాతీయ రహదారిపై మరో బస్సు బోల్తా

Mar 10,2025 22:38

15 మందికి గాయాలు
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌
ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున యోలో ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. పోలీసులు, హైవే సిబ్బంది, 108 సిబ్బంది సంయుక్తంగా కృషి చేసి క్షతగాత్రులను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఏలూరు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యోలో ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు విశాఖపట్నం నుంచి గుంటూరుకు 49 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి బయలుదేరింది. ఈ బస్సు ఆశ్రం ఆసుపత్రి సమీపానికి సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో చేరుకుంది. అదే సమయంలో బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి ఒక్కసారిగా ఎగిరి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. అయితే ఓ మహిళ మాత్రం తాను మెలకువగానే ఉన్నానని, బస్సు వేగంగా వెళ్లి ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వివరాలు తెలిపింది. బస్సు బోల్తా పడడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వెంటనే మూడు అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు. బస్సు బొల్తా పడడంతో ఒక్కసారిగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గాయాలు కాని ప్రయాణికులను అప్పటికప్పుడు వేరే వేరే వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు స్వల్ప గాయాలైనవారిని ప్రాథమిక చికిత్స అనంతరం వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు సహకరించారు. గాయపడిన వారంతా విశాఖపట్నం, గుంటూరు, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. గాయాలపాలైన వారిలో మహిళలు, బాలురు కూడా ఉన్నారు. ఈ ఘటనపై ఏలూరు రూరల్‌ ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️