ఆక్వాకు ‘భరోసా’ కరువు..!

అప్పులఊబిలో కూరుకుపోతున్న ఆక్వా రైతులు
మేత, మందుల ధరలు పెరుగుదల, నాణ్యమైన సీడ్‌ కరువు
పెట్టుబడులు తడిసి మోపెడు.. పంటకు దక్కని ధర
దిక్కుతోచని స్థితిలో పోరుబాటకు దిగిన రైతులు
కిలో రొయ్యకు ఖర్చు రూ.270.. ధర మాత్రం రూ.230
పదెకరాలు దాటిన ఆక్వాచెరువుకు విద్యుత్‌ సబ్సిడీ నిల్‌
రేపు ఆకివీడులో ఆక్వారైతుల భారీ సమావేశం
భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ఆక్వా రైతులకు భరోసా లేకుండా పోయింది. పండించిన పంటకు సరైన ధర దక్కకపోవడం, మేత, మెడిసిన్‌ ధరలు పెరిగిపోవడం, నాణ్యమైన సీడ్‌ దొరక్క ఆక్వా రైతులు పడుతున్న కష్టాలు రోజురోజుకూ వర్ణణాతీతంగా మారుతున్నాయి. ఆక్వాసాగు చేయాలంటేనే భయపడే పరిస్థితికి రైతులు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన ఆక్వా రైతులకు నిరాశే మిగిలింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు 2.90 లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో లక్షా 32 వేల ఎకరాల్లో, ఏలూరు జిల్లాలో లక్షా 60 వేల ఎకరాల్లో ఆక్వాసాగు సాగుతోంది. రెండు జిల్లాల్లో దాదాపు లక్షన్నర ఎకరాలకు పైగా రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడినా అప్పులు తప్ప చిల్లిగవ్వ లేకపోవడంతో ఆక్వా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వానికి డాలర్లు తెచ్చే ఆక్వా సాగు గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన రైతుల్లో నెలకొంది. దీంతో గత కొన్ని రోజులుగా పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు వంటి మండలాల్లో ఆక్వా రైతులు తమ సమస్యలపై ఆందోళనలు చేసి అధికారులకు వినతిపత్రాలు సైతం ఇవ్వడం జరిగింది. తమ సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదని భావించి బుధవారం ఆకివీడులో ఆక్వా రైతులంతా భారీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇక నుంచి ఆక్వా సమస్యలపై పోరాడే విధంగా భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించుకోవాలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కొండెక్కిన మేత, మందులు ధరలు.. పంటకు ధర పతనంముడిసరుకు ధరలు తగ్గినా మేత ధరలు మాత్రం తగ్గడం లేదు. సోయాబీన్‌ టన్ను ధర లక్షా ఐదు వేల రూపాయల వరకూ ఉంది. మిగిలిన మేత ధరలు సైతం అదేస్థాయిలో ఉండడంతో ఆక్వా రైతులకు మేత కొనుగోలు భారంగా మారింది. మందులకు సంబంధించి మినరల్స్‌ టన్ను ధర రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకూ పలుకుతోంది. వనామీ రొయ్య మేత ధరలు గతంలో టన్ను రూ.45 వేలు ఉండగా ఏకంగా రూ.లక్షా ఐదు వేల వరకూ పెరిగిపోయింది. దీంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఎకరాకు రొయ్యల చెరువుకు రూ.ఐదు నుంచి రూ.ఆరు లక్షల వరకూ ఖర్చవుతున్నట్లు ఆక్వారైతులు చెబుతున్నారు. మేత, మందుల ధరలు పెరిగిపోయి పెట్టుబడి భారీగా అవుతుంటే.. పండిన పంటకు మాత్రం ధర ఉండడం లేదు. వంద కౌంట్‌ కిలో మొన్నటి వరకూ రూ.260 ఉండగా ప్రస్తుతం రూ.230కి పడిపోయింది. 40 కౌంట్‌ ధర కిలో రూ.420 నుంచి రూ.360లకు దిగిపోయింది. 50 కౌంట్‌ ధర రూ.380 నుంచి రూ.350 తగ్గిపోయింది. కిలో రొయ్యకు రూ.270 ఖర్చవుతుంటే ధర మాత్రం కిలోకు రూ.230 ఉంది. దీంతో ఆక్వా రైతులకు ఏవిధంగా మిగులు ఉంటుందో ప్రభుత్వం చెపాల్సి ఉంది. ఆక్వా సీడ్స్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో నాణ్యమైన సీడ్‌ దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.విద్యుత్‌ సబ్సిడీ కొందరికే..ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50లకే ఇస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. విద్యుత్‌ సబ్సిడీ అందరికీ ఇవ్వకుండా కొందరికి మాత్రమే ఇస్తోంది. పదెకరాలు దాటిన చెరువులకు సబ్సిడీ లేకుండా చేశారు. రొయ్యల సాగు ఖర్చుతో కూడుకుంది. దీంతో ఇద్దరు ముగ్గురు రైతుల కలిసి పదెకరాల చెరువు లీజుకు తీసుకుని సాగుచేస్తుంటారు. వారికి విద్యుత్‌ సబ్సిడీ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో రైతుల భారీగా కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్సఫర్‌ ఏర్పాటుకు ఇచ్చే సబ్సిడీ సైతం ఇవ్వడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అదనపు ఛార్జీల కింద భారీగా వడ్డన విధిస్తున్నారంటూ రైతులు ఘొల్లుమంటున్నారు. ఇన్ని కష్టాల మధ్య ఆక్వా సాగు ఏవిధంగా చేయాలంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక పాలసీని ప్రకటించాలని అంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు న్యాయం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

➡️