ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ చర్యలు

స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి – ఏలూరు
ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సర్‌ సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లను, కౌంటింగ్‌ కేంద్రాలను, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లన్నీ సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్‌ హాలులోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ అనుమతించబోమన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ అనుమతించరాదన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్‌ హాళ్లను కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ను తనిఖీచేసి ఇవిఎంల భద్రతను పరిశీలించారు. సంబంధిత స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన అనంతరం సంబంధిత రిజిస్టర్‌లో కలెక్టర్‌ సంతకం చేశారు. వీరి వెంట రిటర్నింగ్‌ అధికారులు ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, ఎం.ముక్కంటి, బి.లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.జెసిచే దెందులూరు స్ట్రాంగ్‌రూమ్‌ తనిఖీ దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను జాయింట్‌ కలెక్టర్‌, దెందులూరు రిటర్నింగ్‌ అధికారి బి.లావణ్యవేణి శనివారం తనిఖీచేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద భద్రతను జెసి పరిశీలించారు. తలుపులకు వేసిన తాళాలను, తాళాలకున్న సీళ్లను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సందర్శకుల రిజిస్టర్‌లో జెసి సంతకం చేశారు.

➡️