తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ల నిర్వహణ
పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపైఅధికారులతో కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ప్రజాశక్తి – పోలవరం
పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా చక్కని దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిలకు ఆలయ ఇఒ, అర్చకులు ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26న పట్టిసీమలో జరిగే శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో పట్టిసం రివర్ ఇన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పట్టిసీమలో ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ లేకుండా నిర్వహించేందుకు శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూ లైన్లు నిర్వహించాలన్నారు. క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా వాటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలుగకుండా, తొక్కిసలాట జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణకు బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులను ప్రాధాన్యతతో నిర్వహించాలని, భక్తుల రద్దీకి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. తాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. యాత్రికులు స్నానం ఆచరించే గోదావరి వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, స్త్రీలు బట్టలు మార్చుకునే గదులు, చలవ పందిళ్లు, రాత్రి పూట ఆలయ ప్రాంగణంలో విద్యుద్దీపాలు, వివిధ సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాల నుండి పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్న దష్ట్యా అవసరాల మేరకు ఆర్‌టిసి బస్సులు నడపాలన్నారు. తాగునీరుకు హ్యాండ్ పంపులు, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయమూ కలగకుండా జనరేటర్లు ఏర్పాటు చేయాలని, ఈ ఉత్సవాల సమయంలో మద్యం అమ్మకాలు జరగకుండా షాపులు తప్పనిసరిగా మూసివేయాలని అన్నారు. భక్తులను నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైన పంట్లు, లాంచీలను ఏర్పాటు చేయాలని, వాటి సామర్థ్యానికి మించి ప్రజలను ఎక్కించకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. తొలుత పట్టిసీమ ఆలయంలో క్యూ లైన్లు తదితర ఏర్పాట్లను కలెక్టర్, జెసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ వెంకటరమణ, డిపిఒ అనురాధ, డిఎస్‌పి వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కుంచనచర్ల జగన్నాధరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఆలయ ఇఒ చాగంటి సురేష్‌నాయుడు, సర్పంచి శ్రీరామమూర్తి, తహశీల్దార్ సాయిరాజు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, సిఐ బాల సురేష్‌బాబు, ఎస్‌ఐ పవన్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
