రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులైంది. కూటమి ఘనంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట హడావుడి చేస్తోంది. పెన్షన్ సొమ్ము పెంపు హామీ అమలవ్వగా మిగిలిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి జనం ఎదురుచూస్తున్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ అమలు చేస్తామని ప్రకటించడం జనానికి కొంత ఊరటనిచ్చింది. ఇదే సమయంలో జనంతోపాటు కూటమి నేతలు సైతం నామినేటెడ్ పదవుల గురించి ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టిడిపికి చెందిన ముగ్గురికి నామినేటెడ్ పదవులు దక్కగా జనసేన నుంచి ఎవరికీ దక్కకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో రెండో జాబితా ఎప్పుడొస్తుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రకటించిన మూడు పదవులు డెల్టా, ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు కేటాయించినట్లుగా కన్పిస్తోంది. ఏజెన్సీ నుంచి ఎపి ట్రైకార్ ఛైర్మన్‌గా బొరగం శ్రీనివాసులు పదవి దక్కించుకోవడం పోలవరం నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహనిచ్చిందనే చెప్పొచ్చు. ముందుగా ప్రకటించినట్లు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ నుంచి తప్పుకున్న టిడిపి జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజుకు ఎపిఐఐసి పదవి కట్టబెట్టి సముచిత స్థానం కల్పించారు. అదే సమయంలో వీరవాసరానికి చెందిన మాజీ మంత్రి పీతల సుజాత గత ఎన్నికల్లోనూ చింతలపూడి టిక్కెట్ ఆశించారు. 2014 ఎన్నికల్లో చింతలపూడి నుంచి టిడిపి తరఫున గెలుపొంది మంత్రి పదవి చేపట్టిన సుజాత ఎంపీ మాగంటిబాబు తదితరులతో విబేధాల నేపథ్యంలో అర్థాంతరంగా మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ ఆమె పార్టీని వీడకుండా 2019, 2024 ఎన్నికల్లోనూ చింతలపూడి టిక్కెట్ ఆశించినా దక్కలేదు. అయినా గత ఎన్నికల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి ఛైర్‌పర్సన్ పదవి దక్కింది. ఇంకా టిడిపిలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న జాబితా చాంతడంతా ఉంది. అందులో జిల్లాస్థాయి ముఖ్యనాయకులు ఉండటం విశేషం. అదే సమయంలో జనసేన నుంచి కూడా నామినేటెడ్ పదవుల ఆశావహులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ప్రధానంగా టిడిపి గెలుపొందిన స్థానాల్లో పోటీ నుంచి తప్పుకున్న వారు, ఇతర నేతలు పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే కార్యాచరణలో వీరిలో ఎంతమందికి పదవులు దక్కుతాయనేది అనుమానమే. ఈ క్రమంలోనే వైసిపి నుంచి కొంతమందిని జనసేనలోకి చేర్చుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నామినేటెడ్ పదవులు దక్కకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగి పదవులు దక్కించాలనుకుంటే ఆ పదవుల్లో ఉన్నవారు తమ పార్టీలోకి చేరాక ఆ పదవులు వదులుకుంటారా అని ఆ పార్టీ దిగువస్థాయి నేతలు ప్రశ్నిస్తుండటం గమనార్హం. ఏదేమైనా నామినేటెడ్ పదవుల పందేరం కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణుల్లో ఒకింత ఉత్సాహం, మరికొంత నిస్తేజం కల్గిస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక నూజివీడులోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు ఎప్పుడు చక్కదిద్దుకుంటాయోనని అక్కడి విద్యార్థులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులు చదువుకన్నా తమ ఆరోగ్యం కోసం తపన పడాల్సి రావడం, అర్ధాకలితో అలమటించాల్సి రావడం నిజంగా బాధాకరమే. ఇప్పటికీ అక్కడ మెస్‌ల్లో పరిస్థితులు మారకపోవడం వ్యవస్థీకృత లోపానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మెస్ కాంట్రాక్టర్‌ను తక్షణం మార్చాలని కొత్తగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అమరేంద్రరావుకు మంత్రి పార్థసారధి ఇచ్చిన ఆదేశాలు ఏమేరకు అమలవుతాయో, విద్యార్థుల ఇబ్బందులు ఎప్పటికి గట్టెక్కుతాయో వేచిచూడాలి. -విఎస్‌ఎస్‌వి.ప్రసాద్