ఎటిఎం.. ఎనీ టైం మరమ్మతులు

తరచూ మొరాయిస్తున్న వైనం
ముదినేపల్లి మండల ప్రజలు వెతలు
అధికారులపై ఖాతాదారులు ఆగ్రహం
ప్రజాశక్తి – ముదినేపల్లి
ఎటిఎంలు ఉన్నా ఉపయోగం సున్నా అన్న చందంగా తయారైంది ముదినేపల్లిలో పరిస్థితి. ముదినేపల్లిలో ఉన్న ఎటిఎంలు తరచూ మొరాయిస్తూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎటిఎంలు ఉన్నా ఉపయోగం లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఎటిఎంలు ఏ రోజు పనిచేస్తాయో, ఏ రోజు పనిచేయవో తెలియక వినియోగదారులు తికమక పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నగదు డ్రా చేసుకునేందుకు, నగదు డిపాజిట్‌ చేసుకునేందుకు వచ్చే ఖాతాదారులు ఎటిఎం, సిడిఎం పనిచేయకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. పనిచేయని మిషన్లు ఎందుకు పెట్టారంటూ బ్యాంక్‌ అధికారులను తిట్టి పోస్తున్నారు. కొందరైతే ఏకంగా బ్యాంక్‌ అధికారులకు శాపనార్ధాలు పెడుతున్నారు. ఎటిఎంలు పనిచేయకపోవడం, సిడిఎం మొరాయించడంపై బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సదరు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఖాతాదారులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎటిఎంల మెయింటినెన్స్‌ చూడాల్సిన బ్యాంకు అధికారులు ఏమీ పట్టించుకోకపోవడంపై ఖాతాదారులు బ్యాంకు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. దీంతో నగదు అత్యవసరమైన వారు ముదినేపల్లికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ గాని, గుడ్లవల్లేరు లేక 20 కిలోమీటర్ల దూరంలో కైకలూరు, బంటుమిల్లి ఎటిఎంలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. నగదు అత్యవసరమైన ఖాతాదారులు స్థానికంగా ఉన్న కొంతమంది కమిషన్‌ వ్యాపారుల వద్దకు వెళ్లి వెయ్యికి రూ.30 నుంచి రూ.50 వరకు కమిషన్‌ చెల్లించి నగదు తీసుకోవడం, లేక వారి ఫోన్‌ పేల్లో వేయించుకోవడం జరుగుతుందని జనం చెబుతున్నారు. ముదినేపల్లిలో ఉన్న ఎటిఎంలు, సిడిఎం సక్రమంగా పనిచేయకపోవడంతో కమిషన్‌ వ్యాపారులకు బాగా లాభసాటిగా ఉందని జనం చెప్పుకుంటున్నారు. ముదినేపల్లిలో ఐదు ఎటిఎంలు ఉన్నాయి. వీటిలో ఎస్‌బిఐ రెండు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, కృష్ణ సహకార కేంద్ర బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులకు చెందిన ఒక్కొక్క ఎటిఎం ఉన్నాయి. ఎస్‌బిఐకు చెందిన సిడిఎం ఒకటి ఉంది. వీటిలో గురజ రోడ్డులోని ఎస్‌బిఐకు చెందిన ఎటిఎం, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎటిఎంలను తీసివేశారు. ఇక ఉన్న మూడింట్లో యాక్సిస్‌ బ్యాంకు ఎటిఎంలో గత మూడు నెలల క్రితం చోరీ జరగడంతో దానిని మూసి వేశారు. దీంతో ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎటిఎం, ఎస్‌బిఐ ఎటిఎం, ఎస్‌బిఐ సిడిఎం మాత్రమే పని చేస్తున్నాయి. సిడిఎం గత మూడు నెలలుగా పనిచేయటం లేదు. దీంతో నగదు డిపాజిట్‌ చేసుకునేందుకు వచ్చే ఖాతాదారులు నిరాశతో వెళ్లిపోతున్నారు. అదే మాదిరి ఎస్‌బిఐ ఎటిఎం కూడా జనానికి నరకం చూపిస్తుంది. నెలలో పట్టుమని పది రోజులు కూడా పనిచేయటం లేదు. ఎప్పుడూ ఎస్‌బిఐ ఎటిఎం, సిడిఎంలు మొరాయిస్తూ ఉండడంతో ఖాతాదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు పడిగాపులు కాసే పని లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎటిఎంలు ఏర్పాటు చేసినప్పటికీ అవి అలంకారప్రాయంగా మరాయి. ఎటిఎం వినియోగదారుల నుంచి బ్యాంకులు సేవ రుసుము తీసుకుంటున్నప్పటికీ ఎటిఎంలు 24 గంటలు సక్రమంగా పని చేసిన దాఖలాలు ఎక్కడ కానరావడం లేదు. ఇక పండుగ రోజుల్లో అయితే ఎటిఎంలు అసలు పని చేయవు. ఒకవేళ పని చేసినా ఎటిఎంల్లో నగదు లేక ఖాతాదారులు అనేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రతిఒక్కరు ఎటిఎంకు వెళ్లి పని చేయకపోవడం చూసి, ఒకవేళ పని చేసినా నగదు డ్రా కాక తెల్ల మొహం వేసి బయటకు వస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ఎటిఎంలు పనిచేయక ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎటిఎంలకు మరమ్మతులు చేపట్టి సక్రమంగా పనిచేసేలా చూడడంతో పాటు ఎటిఎంలో నగదు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని మండలంలోని ఖాతాదారులు బ్యాంకు అధికారులను ముక్తకంఠంతో కోరుతున్నారు.

➡️