బెడ్స్‌ బెంగ.. వైద్యం అరకొర..!

ఏలూరు సర్వజన ఆసుపత్రిలో రోగుల కష్టాలు
బెడ్స్‌ లేవని విజయవాడ పంపడంపై ఆవేదన
వైద్యుల నియామకంపై పట్టించుకోని సర్కార్‌
ఐసియులోనూ సక్రమంగా అందని వైద్యం
మెడికల్‌ కాలేజీగా మార్పు చేశాక పరిస్థితి అధ్వానం
ఆసుపత్రి సమస్యలపై ప్రత్యేక సమావేశంపై డిఆర్‌సిలో నిర్ణయం
ఇప్పటికీ అతీగతీలేని పరిస్థితి
రోగుల బాధలపై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది’ అనే చందంగా ఏలూరు సర్వజన ఆసుపత్రి పరిస్థితి తయారైంది. వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో ఉన్నప్పుడు అద్భుతమైన వైద్య సేవలందంచిన ఏలూరు జిల్లా ఆసుపత్రి, బోధనా ఆసుపత్రిగా మారిన తర్వాత అత్యంత దారుణంగా మారిందని జనం తలలు పట్టుకుంటున్నారు. సర్వజన ఆసుపత్రికి వెళ్లాలంటేనే రోగులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అత్యవసర వైద్యం కోసం సర్వజన ఆసుపత్రికి వెళ్లిన రోగులకు వైద్యులు మొదట చెప్పేమాట ఒక్కటే.. బెడ్స్‌ లేవు విజయవాడ, గుంటూరుకుగాని వెళ్లండని. రోగులు గట్టిగా నిలదీస్తే ఒక సెలైన్‌ పెట్టి వదిలేస్తున్నారు. దీంతో రోగుల బంధువులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఆసుపత్రిలో బెడ్‌ ఇప్పించండంటూ రాజకీయ నాయకులకో.. లేక పలుకుబడి ఉన్నవారికో ఫోన్లు చేసి రోగి బంధువులు వేడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బెడ్స్‌ ఖాళీగా ఉన్నా లేవని విజయవాడ రిఫర్‌ చేస్తున్నారని రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఏదైనా అత్యవసర కేసులు తప్ప విజయవాడ, గుంటూరుకు రిఫర్‌ చేసేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ వైద్యం అందే కేసులను సైతం విజయవాడ వెళ్లిపోవాలని చెప్పేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ప్రతిరోజూ వెయ్యి నుంచి 1200 మంది రోగులు ఓపి సేవలు పొందుతుంటారు. 600 మందికిపైగా రోగులకు ఇన్‌పేషెంట్‌ సేవలు అందుతాయి. బోధనా ఆసుపత్రిలో రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే 97 మంది వైద్యులు ఉండాలి. ప్రస్తుతం 35 మంది కూడా లేని పరిస్థితి. దీంతో రోగులకు వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. సర్వజన ఆసుపత్రికి వెళ్తే రోగం తగ్గి ఇంటికి వెళ్తామనే నమ్మకం జనంలో తగ్గిపోతుంది. ఐసియులో సైతం వైద్యసేవలు సరిగా అందడం లేదని రోగులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఐసియులో వైద్యుల పర్యవేక్షణ సరిగా ఉండడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఆసుపత్రిలో శుభత్ర విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ వైద్యం విషయంలో మాత్రం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధనా ఆసుపత్రిలో వైద్యసేవలకు సంబంధించి పర్యవేక్షణ అంతా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ప్రిన్సిపల్‌ సరిగా పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.మళ్లీ ప్రయివేటు ఆసుపత్రికి సర్వజన ఆసుపత్రికి వచ్చిన రోగులు చాలా మంది సరైన వైద్యం అందక డిశ్చార్జి చేయించుకుని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పేదలు ఆర్ధికంగా నలిగిపోతున్నారు. బోధనా ఆసుపత్రిలో ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లు డాక్టర్లుగా ఉంటారు. వీరు రోగులతో సరిగా సఖ్యతగా ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు సైతం వైద్యుల కొరత ఉండేది. ఇప్పుడు కంటే ఎక్కువ మంది రోగులు ఆసుపత్రికి వచ్చేవారు. అప్పుడు అందినట్లుగా ఇప్పుడు వైద్యసేవలు ఎందుకు అందడం లేదనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. జిల్లా ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీగా మార్పు చేసి ప్రజలకు వైద్యసేవలు సరిగా అందకుండా చేశారనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం సైతం సరిగా పట్టించుకోవడం లేదనే చర్చ జనాల్లో నడుస్తోంది.డిఆర్‌సి సమావేశంలో నిర్ణయాల అమలేది..? ఏలూరు సర్వజన ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనవరి 16న ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో జరిగిన డిఆర్‌సి సమావేశంలో చర్చ జరిగింది. ప్రజాప్రతినిధులంతా ఆసుపత్రిలోని సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, తాను కూడా ఉదయం విజిట్‌ చేశానని తెలిపారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో చర్చకు సమయం లేదు కాబట్టి వారం, పది రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. దాదాపు రెండు నెలలు గడిచిపోతుంది. ఇప్పటి వరకూ డిఆర్‌సి సమావేశంలో తీసుకున్న ప్రత్యేక సమావేశ నిర్ణయం ఏమైందో ఏఒక్కరికీ తెలీని పరిస్థితి. రోగుల బాధలు ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టడం లేదా అనే చర్చ సాగుతోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిని గాడిన పెట్టకపోతే జిల్లా ప్రజానీకం పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా మారనుందనడంలో ఎటువంటి సందేహామూ అక్కర్లేదు.

➡️