కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యాన రాస్తోరోకో
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శులు డిఎన్‌విడి ప్రసాద్, కె.బుచ్చిబాబు, బద్ధ వెంకటరావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్త్తోందని విమర్శించారు. మూడేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలని మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, అయితే రాష్ట్ర ప్రజానీకం మద్దతుతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పథకం ప్రకారం స్టీల్‌ప్లాంట్‌ను నష్టాల్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన విశాఖ స్టీల్ ఉత్పత్తిని కావాలనే బిజెపి ప్రభుత్వం తగ్గించి నష్టాల్లోకి నెట్టి ప్రయివేటు వారికి అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. నూతన ప్రభుత్వ ఏర్పడిన తర్వాత స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్‌వర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్ అని కొనియాడారన్నారు. 45 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్‌ను రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, మోడీని ఒప్పించి స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికి రెండు నెలలు గడిచినా స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో నడపడానికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా ప్లాంటును నాశనం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశారన్నారు. టిడిపి మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం కనీసం ప్రశ్నించడం లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బిజెపిపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘాల నాయకులు డేగ ప్రభాకర్, కే శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బండి వెంకటేశ్వరరావు, కిసాన్ సెల్ నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు మాట్లాడుతూ లక్ష మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తూ, మూడు లక్షల కోట్ల సంపద కలిగిన స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటు వారికి కట్టబెట్టాలని చూస్తే రాష్ట్రంలోని రైతులు, కార్మికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎఐటియుసి నాయకులు ఆర్.శ్రీనివాస్ డాంగే, ఎం.కృష్ణ చైతన్య, కె.కృష్ణమాచార్యులు, ఐఎఫ్‌టియు నాయకులు వై.శ్రీనివాసరావు, ఎం.అప్పారావు, పి.గంగరాజు, సిఐటియు నాయకులు బి.సోమయ్య, వివిఎన్.ప్రసాద్, జి.రవికిషోర్, కె.పోసమ్మ, వైఎస్.కనకారావు, కె.విజయలక్ష్మి నాయకత్వం వహించారు.కామవరపుకోట : విశాఖ స్టీల్‌ను ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం కామవరపుకోటలో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు ప్రధాన రహదారిపై సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి టివిఎస్.రాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఎఐటియుసి ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కోటిగంటి సోమరాజు, ఎన్న భీమయ్య, ఆర్.బాలరాజు, దుర్గాప్రసాద్, గోవిందరాజు, వెంకన్న, శేషం రాజు పాల్గొన్నారు.నూజివీడు టౌన్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని కోరుతూ నూజివీడు చిన్న గాంధీబొమ్మ సెంటర్లో సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి.రాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని దానికి అవసరమైన వనరులు, గనులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలన్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది చేసేందుకే గతంలో నల్ల చట్టాన్ని తీసుకొచ్చి వ్యవసాయని దెబ్బతీసే ప్రయత్నం చేసిందన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు ఎన్నార్ హనుమాన్లు, సిఐటియు నాయకులు జయలక్ష్మి, రజిని, నాగూర్, సంసోన్ రవి, మరియ దాసు, శోభనాద్రి నాయుడు, అరుణ్ నాని, ఎఐటియుసి కార్యదర్శి పుల్లారావు పాల్గొన్నారు.
