వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి..

ఏలూరు స్పోర్ట్స్‌ : వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ.2 లక్షల 40 వేలను ఎత్తుకుపోయిన దారి దోపిడీ ముఠాను ఏలూరు ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఏలూరు నగరంలోని ఏలూరు సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరు డిఎస్‌పి శ్రావణ్‌ కుమార్‌ పాల్గొని తెలిపిన వివరాల ప్రకారం భీమడోలు ప్రాంతానికి చెందిన గొట్ట వీరేష్‌ స్థానికంగా ఆర్‌ఆర్‌ పేటలో నివాసముంటూ ఏలూరు నగరంలోని ఒకటవ పట్టణ పరిధిలో ఉన్న ఆదిత్య అసోసియేషన్‌ అనే హిందుస్థాన్‌ లివర్‌ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రతిరోజు వచ్చిన నగదును తన వెంట తీసుకుని ఇంటికి తీసుకువెళ్లి తిరిగి మరలా ఉదయం కార్యాలయానికి తీసుకుని వస్తూ ఉంటాడు. మండలంలోని చేబ్రోలు గ్రామానికి చెందిన కల్లపల్లి దుర్గా నాగ వెంకట కొండలరావు అలియాస్‌ పండు అనే వ్యక్తి ప్రస్తుతం ఏలూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో నివాసం ఉంటున్నాడు. ఇతను గత కొంతకాలం క్రితం ఇదే సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి కొన్ని కారణాలవల్ల మానేశాడు. ఇతని స్నేహితులైన ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి చెందిన గుమ్మల మణికంఠ, అతని బావమరిది కల్లపల్లి చందు అలియాస్‌ అచ్చు అనే వ్యక్తులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. గత రెండు వారాలుగా వీరేష్‌ కదలికలపై వీరు రెక్కి నిర్వహించారు. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వీరేష్‌ తన ద్విచక్ర వాహనంపై రూ.2 లక్షల 40 వేల నగదును తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్లే మార్గమధ్యంలో సరిగ్గా కాంగ్రెస్‌ కార్యాలయానికి చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు అతని ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. వెంటనే అతని కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రెండు లక్షల 40 వేల రూపాయల బ్యాగును అప్పగించుకుని పారిపోయారు. వీరేష్‌ వెనుక పరిగెట్టిన ప్రయోజనం లేకపోయింది. దీంతో అదేరోజు ఒకటో పట్టణ పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు. దీనిపై ఏలూరు ఒకటో పట్టణ సిఐ సత్యనారాయణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ఈ ముగ్గురు నిందితులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

➡️