‘చింతలపూడి’ పూర్తి చేస్తాం

చెరువులకు నీళ్లిచ్చేలా చర్యలు
అవుటర్‌ రింగ్‌ రోడ్డుతో అభివృద్ధి ముందుకు
మామిడి రైతులకు అండగా ఉంటాం
ఆగిరిపల్లిలో 206 పేద కుటుంబాలకు మార్గదర్శకుల సాయం
పి-4 ప్రజావేదికలో సిఎం చంద్రబాబు
యాదవ, నాయీ బ్రాహ్మణ కుటుంబాల ఇంటికి వెళ్లి సమస్యలు అడిగిన సిఎం
గత వైసిపి సర్కార్‌ కంటే ఘోరంగా మీడియాపై ఆంక్షలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, ఆగిరిపల్లి
చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, 2019లో టిడిపి ప్రభుత్వం రాకపోవడంతో పూర్తి కాలేదని, ఇప్పుడు సమస్య కోర్టులో ఉందని, సమస్యను పరిష్కరించి ‘చింతలపూడి’ని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని సిఎం చంద్రబాబు తెలిపారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మార్కెట్‌ యార్డ్‌లో పి-4 ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిఎం చంద్రబాబు ఉదయం 10.45 గంటలకు వడ్లమానులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. సిఎంకు మంతులు కొలుసు పార్థసారధి, సవిత, ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌, ఎంఎల్‌ఎలు బడేటి చంటి, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్‌, సొంగా రోషన్‌కుమార్‌, మేయర్‌ నూర్జహాన్‌, ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ, ఏలూరు రేంజ్‌ ఐజి జివిజి.అశోక్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి, జెసి ధాత్రిరెడ్డి, ఎస్‌పి ప్రతాప్‌ శివ కిషోర్‌, మాజీ ఎంఎల్‌ఎ గన్ని వీరాంజనేయులు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్ఫగుచ్చాలు ఇచ్చి సిఎంకు ఘనస్వాగతం పలికారు. ముందుగా యాదవ సామాజిక తరగతికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సిఎం వారి పశువుల పాకను పరిశీలించి గేదెలు, మేకల పెంపకం ద్వారా ఆదాయం ఏవిధంగా పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. తర్వాత నాయీబ్రాహ్మణులకు చెందిన బత్తుల జగన్నాథం క్షౌరశాలను సిఎం పరిశీలించారు. జగన్నాథంతో మాట్లాడి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. అత్యాధునిక పనిముట్లతో కూడిన కిట్‌ను సిఎం బహూకరించారు. అనంతరం మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు సిఎం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, సభా వేదికకు చేరుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 99 వేల బంగారు కుటుంబాలు ఉండగా ఆగిరిపల్లిలో 206 కుటుంబాలు ఉన్నాయన్నారు. మెట్ట ప్రాంత అభివృద్ధికి సహకరించండిమంత్రి పార్థసారధి, ఎంపీ పుట్టా మహేష్‌ జిల్లాలో నూజివీడు మెట్ట ప్రాంతమని, అభివృద్ధిలో వెనుకబడి ఉందని, సాయం చేయాలని మంత్రి పార్థసారధి సిఎంను కోరారు. మెట్ట ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరారు. పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తే సద్గురు, కొమ్మూరు, మీర్జాపురం చెరువులకు నీళ్లందుతాయని, దాదాపు 25 వేల ఎకరాలు సాగవుతుందని తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయడంతోపాటు ఏలూరులో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమల ఏర్పాటులో ఇబ్బంది ఉందని తెలిపారు. ఆగిరిపల్లి సచివాలయం-2 కార్యదర్శి బి.ప్రసాద్‌ మాట్లాడుతూ గ్రామంలోని జనాభా, అక్కడ స్థితిగతులను సిఎంకు వివరించారు. అగిరిపల్లిలో తలసరి కుటుంబ ఆదాయం రూ.2,06,403గా ఉందని తెలిపారు.గంటా 25 నిముషాలు సిఎం ప్రసంగం పి-4 కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబు దాదాపు ఒంటి గంటకు ప్రారంభించి 2.25 గంటల వరకూ దాదాపు గంటా 25 నిముషాలు ప్రసంగించారు. బిసిలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, ఇళ్ల నిర్మాణాలతోపాటు అనేక అంశాలను ప్రస్తావించారు. ఆగిరిపల్లిలో 55 కుటుంబాలకు ఇంటి స్థలం లేదని, భూమి సేకరించి ఇళ్లు కట్టిస్తామని కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నట్లు తెలిపారు. 31 ఇళ్లలో మరుగుదొడ్లు లేవని, ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి సిఎం అధికారులకు తెలిపారు. 30 కుటుంబాలకు కుళాయి లేదని ఏర్పాటు చేయాలన్నారు. కరెంటు ఉన్నవారంతా సోలార్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 12 కిలోమీటర్ల సీసీ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేస్తామని, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ 20 కిలోమీటర్లు పూర్తి చేస్తామని, వీధిలైట్లు లేనిచోట్ల ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. పి-4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 206 కుటుంబాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన ప్యారీ రేష్మ, బోనం లక్ష్మిదుర్గతో సిఎం మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోనం లక్ష్మి దుర్గకు భర్త చనిపోయి రెండేళ్లయినా పింఛన్‌ రాలేదని చెప్పడంతో వచ్చే నెల నుంచే పింఛన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. మార్గదర్శకులగా ముందుకొచ్చిన నూజివీడు సీడ్స్‌ అధినేత ప్రభాకర్‌, కుశలవ గ్రూప్‌ సిద్ధార్థ, హ్యాపీ వ్యాలీ స్కూల్‌ అధినేత గౌతమ్‌, నితిన్‌ సాయి కనస్ట్రక్షన్‌ నితిన్‌ కృష్ణ, మోడల్‌ డెయిరీ ఛైర్మన్‌ పిన్నమనేని ధనప్రకాష్‌, ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్‌ కాలేజీ ఛైర్మన్‌ రావి వెంకట్రావు మాట్లాడుతూ పేద కుటుంబాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మార్గదర్శకులకు సిఎం శాలువా కప్పి సత్కరించారు.గ్రూపు రాజకీయాలపై చంద్రబాబు సీరియస్‌ ఆగిరిపల్లిలో పి-4 కార్యక్రమం ముగిసిన తర్వాత టిడిపి నాయకులు, కార్యకర్తలతో సిఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతిం చలేదు. అంతర్గత సమాచారం ప్రకారం నూజివీడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల గ్రూప్‌ రాజకీయాలపై చంద్రబాబు సీరియస్‌ అయినట్లు తెలిసింది. మంత్రి కొలుసు పార్థసారధి గ్రూప్‌, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గ్రూపుల మధ్య ముదురుతున్న విబేధాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. గ్రూప్‌ రాజకీయాలకు స్వస్తి పలకకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా సోషల్‌ మీడియాలో దిగజారుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని తెలుగు తమ్ముళ్లను హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ విధానాలను ప్రజలు మెచ్చేవిధంగా ప్రతిఒక్క నాయకుడు కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది.గత వైసిపి సర్కార్‌ కంటే ఘోరంగా మీడియాపై ఆంక్షలు గత వైసిపి ప్రభుత్వంలో సిఎం పర్యటనలో మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించేవారు. ప్రింట్‌ మీడియా ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్‌లకు మీడియా పాస్‌లు ఇచ్చేవారు కాదు. రిపోర్టులను సైతం తీసుకెళ్లి ఒకచోట కూర్చోపెట్టి, మళ్లీ తీసుకొ చ్చేవారు. దీంతో గత ప్రభుత్వ తీరును జర్నలిస్టులు తీవ్రంగా వ్యతిరే కించినా పరిస్థితి కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే మీడియా కు స్వేచ్ఛ కల్పిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల్లో చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి పదినెలలు గడిచిపోయింది. జర్నలిస్టులపై ఆంక్షలు మాత్రం తొలగలేదు. సిఎం పోలవరం పర్యటనకు వచ్చినా ఇవే ఆంక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆగిరిపల్లి మండలంలో పి-4 కార్యక్రమాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రింట్‌ మీడియా ఫొటోగ్రాఫర్లకు, ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్‌లకు మీడియా పాస్‌లు ఇవ్వలేదు. హెలీప్యాడ్‌ వద్దకు ఏఒక్కరినీ రానివ్వలేదు. సిఎం బిసి కుటుంబాలను కలిసినా అక్కడికి మీడియాకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం నియమించిన పిఆర్‌ఒలు ఏ ఫోటో ఇస్తే అదే పెట్టుకోవాలని, ఏది రాసిస్తే అదే ప్రచు రించాలనే రీతిలో వ్యవహారం సాగుతోంది. కావాలని కొందరు అధికా రులే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వంలో ఈ విధానం లేదు.

➡️