కలెక్టర్‌ కృషి అభినందనీయం

రిటర్నింగ్‌ అధికారులు
ప్రజాశక్తి – ఏలూరు
జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు జిల్లా కలెక్టర్‌ చేసిన కృషి అందరికీ స్ఫూర్తిదాయకం, అభినం దనీయమని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి, పలువురు రిటర్నింగ్‌ అధికారులు అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంలో జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ను కలిసి అభినందన సత్కారం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు జెసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జెసి లావణ్యవేణి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి చిత్తశుద్ధితో పని చేసి వృత్తి ధర్మాన్ని పారదర్శకంగా పాటిస్తూ, ఎవర్నీ నొప్పించకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ అభినందనీయులన్నారు. పోలింగ్‌ రోజున తమ ఓటు లేదనే మాట రాకుండా దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించుకోగలిగామన్నారు. ఈ సందర్బంగా రిటర్నింగ్‌ అధికారులైన ఐటిడిఎ పిఒ ఎం.సూర్యతేజ, ఆర్‌డిఒలు ఎన్‌ఎస్‌కె.ఖాజావలీ, వై.భవానీశంకరీ, కె.అద్దయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు కె.భాస్కర్‌, ఎం.ముక్కంటి, డిఆర్‌ఒ డి.పుష్పమణి కలెక్టర్‌కు పూలమొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల అధికారుల కృషి, వారందించిన సహకారం అద్వితీయమన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామం వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ఇతర ఎన్నికల అధికారులు, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

➡️