16 సాగునీటి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్
40 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికి సన్నాహాలు
చేతులెత్తే విధానంలో ఎన్నికపై రైతుల్లో అసంతృప్తి
గతంలో పోటీ లేకుండా.. ఏకపక్షంగా నిర్వహించారనే విమర్శలు
ఉమ్మడి ‘పశ్చిమ’లో మేజర్ ఇరిగేషన్‌లో 131 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 20 డిసిలు, ఒక ప్రాజెక్టు కమిటీ
మైనర్ ఇరిగేషన్‌లో 222 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, రెండు ప్రాజెక్టు కమిటీలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహిస్తారా.. లేక ఏకపక్షంగా సాగించి ముందుగా అనుకున్నవారినే నియమిస్తారా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ రైతుల్లో పెద్దఎత్తున విన్పిస్తోంది. ఈ నెల 16వ తేదీన సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 40 రోజుల్లో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు చెప్పింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఎన్నికల నిర్వహణ తీరుపై మాత్రం రైతుల్లో తీవ్రమైన చర్చ సాగుతోంది. 2015లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరిగిన తీరును అంతా గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలను మూడు పద్దతుల్లో నిర్వహిస్తారు. వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు మూడు విభాగాలుగా ఎన్నికల నిర్వహణ సాగుతోంది. వాటర్ యూజర్స్ అసోసియేషన్లలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని ఆయకట్టు రైతులు ఎన్నుకొంటారు. ఈ కమిటీల సభ్యులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నుకుంటారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ప్రాజెక్టు కమిటీలను ఎన్నుకుంటాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి గోదావరి డెల్టా పరిధిలోని మేజర్ ఇరిగేషన్‌లో 131 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ఒక ప్రాజెక్టు కమిటీ ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ పరిధిలో 222 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, రెండు ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్‌లో డిస్ట్రిబ్యూటరీ కమిటీలు లేవు. మేజర్ ఇరిగేషన్ అంతా డెల్టా పరిధిలో ఉండగా, మైనర్ ఇరిగేషన్ అంతా మెట్ట ప్రాంతంలో ఉంది. మెట్టప్రాంతంలోని తమ్మిలేరు, ఎర్రకాలువకు రెండు ప్రాజెక్టు కమిటీలు ఉన్నాయి. విభజిత జిల్లాల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని చెబుతుండటంతో కమిటీల లెక్కలు మారే అవకాశం ఉంది.ఎన్నికల నిర్వహణపై చర్చ సాగునీటి సంఘాలకు సంబంధించి వాటర్ యూజర్స్ అసోషియేషన్ కమిటీలోని సభ్యులను ఆయుకట్టు పరిధిలోని రైతులు ఎన్నుకుంటారు. ఈఎన్నికల్లో బ్యాలెట్ పద్దతి లేకుండా చేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి చేతులెత్తే విధానంలో ఎన్నికల నిర్వహించారు. అప్పట్లో పోటీ అనేది లేకుండా చేశారు.ఎక్కడైన పోటీగా అభ్యర్ధి ఉంటే అక్కడ ఎన్నికలు జరపకుండా వాయిదా వేసి, అడ్డదారిలో ఎన్నికలు నిర్వహించారన్న తీవ్ర విమర్శలను అప్పట్లో ప్రభుత్వం మూటగట్టుకుంది. అధికార పార్టీ నాయకులు ముందుగా అనుకున్న సభ్యులనే సాగునీటి సంఘాల ప్రజాప్రతినిధులగా ఎన్నుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆయుకట్టు పరిధిలోని పైన పొలం ఉన్న రైతులను ప్రెసిడెంట్‌గా ఎన్నుకొంటే దిగువన పొలం ఉన్నవారిని వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుంటారు. ఒకవేళ దిగువన పొలం ఉన్నవారికి ప్రెసిడెంట్ ఇస్తే.. పైన పొలం వారికి వైస్ ప్రెసిడెంట్ ఇస్తారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని సాగునీటి సంఘాలకు అనధికారికంగా టిడిపి, జనసేన నాయకులను నియమించిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వీరినే ప్రకటించి మమ అనిపించే అవకాశం కనిపిస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా, ఏకపక్షంగా నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమిటనే చర్చ రైతుల్లో నడుస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించాలని అంతా కోరుతున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఎన్నికలు జరిపినా నిధులివ్వకపోతే ప్రయోజనం శూన్యం సాగునీటి సంఘాలకు 2015లో ఎన్నికలు నిర్వహించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో సాగునీటి సంఘాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. నిబంధనల ప్రకారం రైతులు నీటి తీరువా కింద చెల్లించే సొమ్ములో 60 శాతం వాటర్ యూజర్స్ అసోసియేషన్లకు, స్థానిక పంచాయతీలకు ఐదు శాతం, ఇతర కమిటీలకు నిధులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నిధులతో కాలువల్లో చెత్త వంటివి తొలగించడంతోపాటు రైతులకు ఉపయోగపడే పనులను సాగునీటి సంఘాల ప్రతినిధులు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడం వల్ల రైతులకు ఉపయోగం లేకుండాపోతుంది. ఈసారైనా సాగునీటి సంఘాలకు నిధులు విడుదల చేసి, రైతులకు మేలు చేసేలా చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు.
