తవ్వకాలు నిలువుదల చేయాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

ముదినేపల్లి : మండలంలోని వణుదుర్రులో ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన ఆక్వా చెరువుల అక్రమ తవ్వకాలు, మట్టి అక్రమ తోలకాలను వెంటనే నిలుపుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నం మాధవ జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం ఏలూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గ్రామంలో విచ్చలవిడిగా చెరువుల అక్రమ తవ్వకాలు, మట్టి అక్రమ తోలకాలు చేస్తూ గ్రామంలోని సహజ వనరులను తరలించుకుపోతున్నారన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొనిమట్టి అక్రమ తోలకాలను నిలుపుదల చేయాలని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అధికారుల నిర్లక్ష్యమే యువకుడి మృతి : సిఐటియు

ఏలూరు అర్బన్‌ : ప్రసాద్‌ సీడ్స్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి అధికారులు తనిఖీలు చేయకపోవడమే కారణమని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి ప్రసాద్‌లు విమర్శించారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనిఖీలు చేపట్టని ఫలితంగా ఎస్‌.రవీంద్ర అనే కార్మికుడు సోమవారం మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఫ్యాక్టరీలలో జరుగుతున్న ప్రమాదాలను నివారించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకొని యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా అటు ప్రభుత్వం నుంచిగాని, ఇటు ఫ్యాక్టరీల యజమానుల నుంచి గాని ఏవిధమైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ఫ్యాక్టరీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

➡️