ఉపాధి కూలీలందరికీ పనులు కల్పించాలి : సిపిఎం

టి.నరసాపురం : మండలంలోని 15 గ్రామ పంచాయతీల గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలందరికీ పనులు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడెల్లి వెంకటరావు డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల కార్యదర్శి మడకం సుధారాణి అధ్యక్షతన స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం పార్టీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడెల్లి వెంకటరావు మాట్లాడుతూ మండలంలో అపరిస్కృతంగా ఉన్న ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పనిదినాలు కల్పించాలని, కనీసం రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 16న మండలంలో పాదయాత్రను చేపడుతున్నామని తెలిపారు. ప్రజాసమస్యలు పరిష్కారం చేయాలని నిర్వహిస్తున్న పాదయాత్ర జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, తక్షణమే సూపర్‌ సిక్స్‌ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మడకం కుమారి, బరగడ కుమారి, అనుమోలు మురళీ పాల్గొన్నారు.

ట్రిపుల్‌ ఐటీలో ‘సిగస్‌ 25’ ప్రారంభం

నూజివీడు టౌన్‌ : ఈనెల 14, 15 తేదీలలో జరగబోతున్న ఆర్‌జియుకెటి నూజివీడు వార్షిక సాంస్కృతిక మహోత్సవం సిగస్‌ 25 హైడ్రోజన్‌ బెలూన్‌ లాంచ్‌తో ఘనంగా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎఒ డాక్టర్‌ బి.లక్ష్మణ రావు, డిఎస్‌డబుల్యూ బార్సు డాక్టర్‌ జె.సీతాపతి రావు , డిఎస్‌డబుల్యూ గర్ల్స్‌ డాక్టర్‌ టి.దుర్గా భవాని, సెంట్రల్‌ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ కెప్టెన్‌ డాక్టర్‌ సిహెచ్‌ సుబ్బలక్ష్మి, డాక్టర్‌ సూర్య, డెప్ట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ వై.కళావతి పాల్గొన్నారు. రెండు రోజులు జరగబోతున్న ఈ మహోత్సవంలో ఎన్నో వినోదకరమైన గేమ్‌ స్టాల్స్‌, ఫుడ్‌ స్టాల్స్‌, సాంస్కృతిక కార్యకళాపాలు, మరెన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ఇందులో భాగంగా తోలుబొమ్మలాట, ఫ్లాష్‌ మోబ్‌, క్యాంపస్‌ రేడియో, ఆర్కెస్ట్రా, బ్లైండ్‌ ఫోల్డ్‌ డ్యాన్స్‌, నవదుర్గ అష్టలక్ష్మి, హర్రర్‌ థీమ్‌ వంటి ఎన్నో ప్రదర్శనలు జరగబోతున్నాయి. ‘రివైవింగ్‌ థి టైమ్లెస్‌ ట్రెడిషన్స్‌’ థీమ్‌ అంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను మేల్కొలపడం సిగస్‌ 25 ముఖ్య ఉద్ధేశం. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించడమే సిగస్‌ 25 లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌

పోలవరం : సేవా కార్యక్రమాలలో, విద్య, వైద్యం పట్ల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుంటుందని ప్రధానోపాధ్యాయులు రాఘవన్‌ అన్నారు. తాళ్లపూడి, పోలవరం శాఖల ఆధ్వర్యాన గూటాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కెరీర్‌ గైడెన్స్‌ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి విద్యార్థులకు పరీక్షల విషయంలో పలు సలహాలు, సూచనలు అందించారు. పదవ తరగతి విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌, పరీక్షల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు. విద్యార్థులకు ఫైల్స్‌, సర్టిఫికెట్లు, షీల్డ్స్‌, ఆంగ్ల పుస్తకాలు అందజేశారు. సాయి మాష్టారు విద్యార్థులందరికి పెన్స్‌, హాల్‌టికెట్‌లు అందించారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సురేష్‌, పోసిబాబు, కోశాధికారి హనుమంత రావు, శేఖర్‌, బాలాజీ రాజేష్‌ పాల్గొన్నారు.

కిడ్నీపై అవగాహనా ర్యాలీ

నూజివీడు టౌన్‌ : నూజివీడు పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.నరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ 40 ఏళ్లు నిండిన వారు మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవడం ఎంతో శ్రేయస్కరమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రతి ఒక్కరూ జీవించాలని సూచించారు.

నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

నేడు పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం బర్రింకలపాడు క్యాంప్‌ కార్యాలయంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 25 బస్‌లు, 300 కార్లు వరకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జనసైనికులు, వీర మహిళలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పి.రాము, నాయకులు చిర్రి కృష్ణ సాంబ, నాని పాల్గొన్నారు.

కొయ్యలగూడెం : జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో ఈనెల 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి కొయ్యలగూడెంలో మండల స్థాయి సమావేశం మండల అధ్యక్షులు తోట రవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని పంచాయతీల నుంచి జనసేన గ్రామ అధ్యక్షులు, మండల నాయకులు, జనసైనికులు హాజరై 14న చేపట్టాల్సిన కార్యాచరణను నిర్ణయించారు. మండలం నుంచి 2 బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని పంచాయతీల నుంచి బస్సులతో పాటు అధిక సంఖ్యలో కార్లు వేసుకుని బయలుదేరడానికి కార్యకర్తలు నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన ఏర్పాటు చేస్తున్న మొదటి ఆవిర్భావ సభను అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలవరం ఎంఎల్‌ఎ చిర్రి బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్‌ పిలుపు మేరకు మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

ముదినేపల్లి : మండలంలోని సింగరాయపాలెం గ్రామంలో ఈనెల 14న జరగనున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ కోరారు. సింగరాయపాలెంలో గురువారం జనసేన నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

అన్నసమారాధనలో యాత్రికులు

ప్రజాశక్తి – ముసునూరు

మండలకేంద్రమైన ముసునూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీవెంకటాచలపతి శ్రీనివాస, శ్రీదేవి భూదేవిల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు.చేతికి అంది వచ్చిన యువకులు కుటుంబంలో స్థిరపడతారు అనుకునే సమయంలో అధికారుల సమన్వయ లోపంతోనే అన్యాయంగా మృతిచెందారని వాపోయారు.

➡️