ఎంఆర్‌ఐ, సిటీస్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువు
రక్త పరీక్ష కేంద్రాలపైనా కొనసాగుతున్న తీవ్ర నిర్లక్ష్యం
అధికారుల నిర్లక్ష్యంతో బలవుతున్న నిండు ప్రాణాలు
ప్రయివేటు స్కానింగ్, రక్త పరీక్ష కేంద్రాల్లో అధికారుల తనిఖీలు నిల్
భారీగా మామూళ్లు ముట్టడమే దీనికి కారణమా..?
స్కానింగ్ సెంటర్ల సమాచారం ఇచ్చేందుకు అధికారులు ససేమిరా
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లోపాల కారణంగా నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఆ శాఖాధికారుల నిర్లక్ష్యం సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మంగళవారం జిల్లాకేంద్రం ఏలూరులో సుస్మిత డయాగ్నొస్టిక్ సెంటర్‌లో ఓ మహిళ ఎంఆర్‌ఐ స్కానింగ్ తీస్తుండగా మృతి చెరదిన ఘటనే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. ఏలూరు జిల్లాలో అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం వంద వరకూ ఎంఆర్‌ఐ, సిటీ స్కానింగ్ సెంటర్లు ఉండగా, మరో వంద వరకూ రక్త పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. స్కానింగ్, రక్త పరీక్ష కేంద్రాల్లో ప్రతిరోజూ వేలాది మంది పరీక్షల కోసం వెళ్తుంటారు. అంత పెద్దసంఖ్యలో రోగులు వెళ్లే స్కానింగ్, రక్త పరీక్ష కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ అనేది లేకుండాపోయింది. స్కానింగ్, రక్త పరీక్ష కేంద్రాలు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా.. అక్కడి నిపుణులైన వారిని నియమించారా అనే విషయాలను వైద్యారోగ్య శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. స్కానింగ్ సెంటర్లు అనుమతి తీసుకున్న వారు నిర్వహిస్తున్నారా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. స్కానింగ్, రక్త పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో వైద్యశాఖ అధికారులు కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో పాటించాల్సిన నిబంధనలను సైతం వైద్య ఆరోగ్యశాఖ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ప్రాణాలు పోయిన సందర్భాల్లో మాత్రమే హడావుడి చేసి నివేదికలు సమర్పించడం, తర్వాత మమ అనిపించడం జిల్లా వైద్యఆర్యోగ శాఖాధికారులకు పరిపాటిగా మారిపోయింది. నిబంధనల ప్రకారం స్కానింగ్ సెంటర్లలో రేడియాలజీకి చెందిన టెక్నీషియన్, రక్తపరీక్ష కేంద్రాల్లో ఎంఎల్‌టికి సంబంధించిన డిప్లమో, బిఎస్‌సి ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు చదివిన వారుండాలి. చాలా స్కానింగ్ సెంటర్లలో కోర్సులు చేయని అనర్హులను నియమించుకుని పని కానిచ్చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేస్‌మేకర్ ఏర్పాటు చేసిన రోగికి స్కానింగ్ తీయడంపై అక్కడి వారికి అవగాహన లేకపోవడం కారణంగానే మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం జిల్లా వైద్య శాఖాధికారులు నిరంతరం స్కానింగ్, రక్తపరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎక్కడా అటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గతంలోనూ అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ దృష్టికెళ్లి ఆదేశిస్తే తప్ప జిల్లా వైద్యశాఖాధికారులు ఏ ఒక్క పనినీ సక్రమంగా చేయని పరిస్థితి ఉంది. జిల్లా వైద్యశాఖ అధికారుల పనితీరు అంతా వారి సొంత ఎజెండా ప్రకారం సాగిపోతుందే తప్ప ప్రజా సమస్యలపై ఉండటం లేదనే చర్చ జనాల్లో సాగుతోంది.స్కానింగ్ సెంటర్ల సమాచారం ఇవ్వకుండా అధికారుల గోప్యత జిల్లాలో స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు సైతం డిఎంహెచ్‌ఒ కార్యాలయ అధికారులు, సిబ్బంది వెనుకాడుతున్నారు. స్కానింగ్ సెంటర్లకు సంబంధించి లోపాలు బయటపడతాయనే ఆందోళన వారిలో కన్పిస్తోంది. స్కానింగ్ సెంటర్లు, రక్తపరీక్ష కేంద్రాలకు అనుమతి తీసుకున్న వ్యక్తులు, నిర్వహిస్తున్న వారు చాలా కేంద్రాల్లో వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకున్న సర్టిఫికెట్ ఒకరి పేరున, నిర్వహిస్తున్న వారు వేరొకరు ఉంటున్నట్లు రోగుల్లో చర్చ నడుస్తోంది. సంబంధిత విద్య అభ్యసించిన వారు కాకుండా, అనర్హులను తక్కువ జీతాలకు టెక్నీషియన్ల వద్ద పని చేసిన వారిని నియమించుకుని స్కానింగ్‌లు, పరీక్షలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వైద్య ఆర్యోగశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అసలు విషయాలు బయటికి వస్తాయన్న కారణంతోనే స్కానింగ్, రక్తపరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో ఇవ్వడం లేదని తెలుస్తోంది. సమాచారం ఇవ్వడంలో అక్కడి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.ఆది నుంచి వైద్యఆరోగ్య శాఖలో అవినీతి కంపు జిల్లా వైద్యఆరోగ్య శాఖపై ఆది నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆరోగ్యశాఖ సిబ్బంది నియామకంలో సొమ్ము వసూళ్లు, డిప్యూటేషన్లపై సిబ్బంది నియామకంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు, బిల్లులకు సంబంధించిన అవినీతి ఆరోపణలు.. ఇలా ఎన్నో అవినీతి వ్యవహారాల్లో డిఎంహెచ్‌ఒ ఆఫీసు కూరుకుపోయింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు విచారణలు చేయడం, మళ్లీ పక్కన పెట్టేయడం అధికారులకు పరిపాటిగా మారింది. డిఎంహెచ్‌ఒ కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప జిల్లా ప్రజలకు మేలు జరిగే పరిస్థితి కన్పించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు జిల్లా వైద్యఆర్యోగ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించాలని అంతా కోరుతున్నారు.
